Budget 2025: హోంశాఖకు 10,188 కోట్లు
ABN , Publish Date - Mar 20 , 2025 | 05:59 AM
బడ్జెట్‌లో హోంశాఖకు రూ.10,188కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దు రూ.9,337కోట్లు కాగా ప్రగతి పద్దు కింద రూ.851కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

హైదరాబాద్, మార్చి19(ఆంధ్రజ్యోతి) : బడ్జెట్‌లో హోంశాఖకు రూ.10,188కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దు రూ.9,337కోట్లు కాగా ప్రగతి పద్దు కింద రూ.851కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత ఏడాది కన్నా ఈసారి రూ.725కోట్లు అదనంగా కేటాయించారు. పోలీసు హౌసింగ్ రుణాల కోసం గత ఏడాది రూ.120కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.25కోట్లకు తగ్గించారు. ఐజీ ఇంటెలిజెన్స్ ఎస్‌ఆర్(సీక్రెట్‌సర్వీసు)కు రూ.12కోట్లు, నార్కొటిక్స్ కంట్రోల్‌బ్యూరో ఎస్‌ఆర్‌కు రూ.2.40కోట్లు ప్రతిపా దించారు. హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం సేఫ్ సిటీ ప్రాజెక్టుకు రూ.100కోట్లు కేటాయించారు. న్యాయశాఖకు రూ.2,453కోట్లు కేటాయించారు.
పర్యాటకానికి పెద్దపీట !
పర్యాటకరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ ఏడాది పర్యాటక రంగ ప్రాజెక్టులు చేపట్టడానికి బడ్జెట్‌లో రూ.775 కోట్లు కేటాయించింది. ఇది గత ఏడాది కంటే రూ.262 కోట్లు అదనం కావడం గమనార్హం.వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.15వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు పర్యాటక రంగంలో మూడు లక్షల మందికి ఉపాధి కల్పన లక్ష్యంతో పర్యాటక రంగ విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.
దేవాదాయ శాఖకు241 కోట్లు
దేవాదాయ శాఖకు ప్రభుత్వం రూ.241.37 కోట్లు కేటాయించింది. అందులో ప్రగతి పద్దు కింద రూ.190 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.51.37 కోట్లను కేటాయించింది. మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి దేవాలయ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో కురుమూర్తి జాతరకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రూ.110 కోట్లతో ఇప్పటికే పనులు ప్రారంభించారు. అలాగే, వేములవాడ అభివృద్ధికి రూ.100 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
విద్యకు బడ్జెట్‌లో 11.3% నిధులు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి విద్యా శాఖకు భారీగా నిధులు కేటాయించారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖకు రూ. 23108 కోట్లు కేటాయించిన సర్కారు.. సమీకృత గురుకులాలకు రూ.11,600 కోట్లను బడ్జెట్‌లో ప్రకటించింది. తొలిదశలో 58 నియోజకవర్గాల్లో వీటిని నిర్మించనుంది. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలకు గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ. 1,816 కోట్లు అధికంగా కేటాయించింది. సమీకృత గురుకుల భవనాల కేటాయింపులు కలుపుకొటే ఈసారి విద్యాశాఖ బడ్జెట్ రూ.34,708కోట్లకు చేరింది. మొత్తం బడ్జెట్‌లో ఇది 11.38శాతం కావడం గమనార్హం. ఈ సారి అదనంగా కేటాయించిన నిధులతో విద్యా కమిషన్ సిఫారసుల అమలుకు మార్గం సుగమమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహా నగర అభివృద్ధిపై నజర్ రూ.10 వేల కోట్లకు పైగా కేటాయింపు
హైదరాబాద్ సిటీ, మార్చి19(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. జీహెచ్‌ఎంసీకి రూ.3101.21 కోట్లు కేటాయించి.. ప్రాజెక్టుల విషయంలో ముందు కెళ్లేందుకు ఆర్థిక భరోసాఇచ్చింది. ప్లైఓవర్లు, నాలాల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాటు చేసిన హెచ్‌సీటీ ప్రాజెక్టుకు రూ.2,654 కోట్లు, వాటర్ బోర్డుకు రూ.3,385 కోట్లు కేటాయించింది.