ఖమ్మం నగరంలో 10 ఆస్పత్రుల మూసివేత
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:05 AM
ఖమ్మం నగరంలో 10 ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేసి, అవకతవకలు చేసినందుకు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తెలిపారు. సీఎం సహాయ నిధి దుర్వినియోగం ద్వారా నకిలీ బిల్లుల తయారీతో ఈ సంఘటన వెలుగు చూసింది.

సీఎంఆర్‌ఎఫ్ బిల్లుల జారీలో.. బీఆర్‌ఎస్ హయాంలో అవకతవకలు
వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి
ఖమ్మం కలెక్టరేట్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) : చికిత్సలు చేయించుకోకుండానే నకిలీ బిల్లులు సృష్టించి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులను కాజేసిన వ్యవహారంలో ఖమ్మం నగరంలో 10 ఆసుపత్రులను సీజ్ చేసినట్లు ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతిబాయి తెలిపారు. ఈమేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. రాష్ట్ర విజిలెన్స్ విభాగం, వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర అధికారుల బృందం చేసిన తనిఖీల్లో పలు ఆసుపత్రుల్లో సీఎంఆర్‌ఎఫ్ బిల్లుల జారీలో అవకతవకలకు పాల్పడినట్లు తేలిందన్నారు. వారి తనిఖీల ఆధారంగా మొత్తం పది ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌రద్దు చేసి తక్షణమే మూసివేయాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. అనుమతులు రద్దయిన ఆసుపత్రుల్లో శ్రీ వినాయక ఆసుపత్రి, శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, మేఘశ్రీ హాస్పిటల్, డాక్టర్ జె.ఆర్. ప్రసాద్ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉన్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.