Share News

YouTube 20th anniversary: యూట్యూబ్ పుట్టి 20 ఏళ్లు.. ఇప్పటివరకూ ఎన్ని వీడియోలు అప్‌లోడ్ అయ్యాయంటే..

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:33 PM

ప్రపంచపు అతిపెద్ద డిజిటల్ వీడియో సర్వీస్ వేదిక యూట్యూబ్ ఉనికిలోకి వచ్చి20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో కీలక మైలురాళ్ల గురించి యూట్యూబ్ తాజాగా పంచుకుంది.

YouTube 20th anniversary: యూట్యూబ్ పుట్టి 20 ఏళ్లు.. ఇప్పటివరకూ ఎన్ని వీడియోలు అప్‌లోడ్ అయ్యాయంటే..
YouTube 20th anniversary

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరికీ పరిచయమున్న యూట్యూబ్ పుట్టి 20 ఏళ్లు పూర్తయ్యాయి. కేవలం వీడియోల షేరింగ్ కోసం ఉద్దేశించిన ఈ వెబ్‌సైట్ ఇప్పుడు టీవీ ఛానల్స్‌కు పోటీ ఇచ్చే దశకు చేరుకుంది. అటు విజ్ఞానం ఇటు వినోదం పంచే సాధనంగా మారిపోయింది. కొత్త వంటలు నేర్చుకోవాలన్నా.. పోటీ పరీక్షలకు ప్రీపేర్ కావాలన్నా.. నచ్చిన వీడియోలను మళ్లీ మళ్లీ చూడాలన్నా.. ఇలా అన్నింటికీ కేరాఫ్‌గా యూట్యూబ్ మారింది. ఇక యూట్యూబ్ పుట్టిన 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా సంస్థ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

యూట్యూబ్‌‌ను 2005లో ప్రారంభించారు. నాటి నుంచీ చేటి వరకూ మొత్తం 20 బిలియన్‌ల వీడియోలు అప్‌లోడ్ అయ్యాయి.

స్టీవ్ చెన్, ఛాడ్ హర్లీ, జావెద్ కరీమ్‌లు యూట్యూబ్ సృష్టికర్తలు. ఓ రోజు డిన్నర్ సందర్భంగా వారి మధ్య జరిగిన సరదా చర్చలోంచి యూట్యూబ్ ఆలోచన పుట్టుకొచ్చింది. 2005లో వాలంటైన్స్ డే రోజున దీన్ని అధికారికంగా ప్రారంభించారు. యూట్యూబ్ తొలి వీడియో ‘‘మీ అట్ ది జూ’’ను కరీమ్ జావేద్ స్వయంగా పోస్టు చేశారు. ఆయన శాన్ డియోగో జూలో ఉండగా తీసుకున్న వీడియో ఇది. 19 సెకెన్ల నిడివి కలిగిన ఈ వీడియో క్లిప్‌కు ఇప్పటివరకూ 348 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.


అలా మొదలైన యూట్యూబ్.. నేడు ప్రపంచమంతటా విస్తరించిన వట వృక్షంలా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ వీడియో సర్వీస్ వేదికగామారింది. ఏటా 2.5 బిలియన్ మంది వ్యువర్లు యూట్యూబ్ వీడియోలను వీక్షిస్తుంటారు. సంఖ్యా పరంగా, సబ్‌స్క్రైబర్ల పరంగా అతిపెద్ద డిజిటల్ వేదికగా అవతరించింది.

యూట్యూబ్‌లో ఏటా 20 మిలియన్ వీడియోలు అప్‌లోడ్ అవుతాయట. ఇప్పటివరకూ 20 బిలియన్ వీడియోలు అప్‌లోడ్ అయినట్టు సంస్థ పేర్కొంది. రాబోయే రెండేళ్లలో యూట్యూబ్.. సంఖ్యాపరంగా అమెరికన్ టీవీ సబ్‌స్క్రైబర్ల సంఖ్యను దాటిపోతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.

2006లో గూగుల్ యూట్యూబ్‌ను దక్కించుకోవడం ఓ కీలక మలుపు. మొత్తం 1.65 బిలియన్ డాలర్ల విలువైన ఆల్ స్టాక్ డీల్‌ ద్వారా గూగుల్ యూట్యూబ్‌ను దక్కించుకుంది. గూగుల్‌కు ఉన్న యాడ్ రెవెన్యూ అనుభవం, సెర్చింజెన్ సామర్థ్యాలకు వీడియో షేరింగ్ కూడా తోడవడంతో యూట్యూబ్ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతోంది.


యాడ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కంటెంట్ క్రియేటర్లతో గూగుల్ పంచుకోవడంతో యూట్యూబ్‌‌కు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది.

వీడియో షేరింగ్‌లో తరువాతి శకంగా చెప్పుకునే షార్ట్ వీడియో ఫార్మాట్‌లోనూ యూట్యూబ్.. టిక్‌టాక్, రీల్స్ వంటివాటికి గట్టిపోటీ ఇస్తోంది.

సినిమాలు, టీవీ షోల వేదికలైన నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్ ప్రైమ్, వంటి వాటికి కూడా యూట్యూబ్ దీటుగా నిలుస్తోంది. కాపిరైట్‌కు సంబంధించిన సమస్యలను జాగ్రత్తగా పరిష్కరిస్తూ మేటి డిజిటల్ వేదికగా నిలిచింది.

ఇవి కూడా చదవండి:

యూపీఐని మించిన టెక్నాలజీ.. చైనా రూటే సపరేటు

జపాన్‌లో మరో అద్భుతం.. ఆరు గంటల వ్యవధిలో రైల్వే స్టేషన్ నిర్మాణం

చైనా అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి

Read Latest and Technology News

Updated Date - Apr 25 , 2025 | 02:01 PM