Share News

UPI Fraud: యూపీఐ యాప్స్ వాడతారా.. మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే

ABN , Publish Date - Jul 24 , 2025 | 10:44 PM

యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలపై యూజర్లు అవగాహన పెంచుకోవాలి. మరి ఈ మధ్య కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్న యూపీఐ ఆధారిత సైబర్ మోసాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

UPI Fraud: యూపీఐ యాప్స్ వాడతారా.. మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే
UPI fraud

ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ లాంటి డిజిటల్ చెల్లింపుల విధానం భారతీయుల జీవితాలను ఎంతగా సులభతరం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ లావాదేవీలు పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. యూపీఐ పూర్తి భద్రమైన వ్యవస్థ అయినప్పటికీ యూజర్ల అమాయకత్వం, అవగాహన లేమిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వలలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ యూపీఐ సంబంధిత మోసాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఫిషింగ్.. అసలును పోలినట్టు ఉండే పేమెంట్ లింక్స్ ద్వారా జరిగే మోసాలను ఫిషింగ్ అని అంటారు. ఈ నకిలీ లింక్స్ పై యూజర్లు క్లిక్ చేసినప్పుడు యూపీఐ యాప్ ఆన్ అవుతుంది. ఆ తరువాత డబ్బు ఆటోమేటిక్ గా కట్ అయిపోయి యూజర్లు నష్టపోవాల్సి వస్తుంది.


సిమ్ క్లోనింగ్ మోసాల్లో నేరగాళ్లు బాధిత యూజర్ సిమ్ కార్డుకు సంబంధించి ఓ డూప్లికేట్‌ను సృష్టిస్తారు. ఆ తరువాత ఈ సిమ్ ద్వారా బాధితుడి యూపీఐ అకౌంట్ ను స్వాధీనం చేసుకుని డబ్బు దండుకుంటారు.

మనీ మ్యూల్ మోసాల్లో సైబర్ నేరగాళ్లు ఇతర యూజర్లను మధ్యవర్తులుగా వాడుకుని డబ్బు దండుకుంటారు. యూజర్ల అకౌంట్ల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహిస్తారు. ఇందుకోసం కొంత కమిషన్‌ను కూడా ఇస్తారు.

విషింగ్ మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు బాధితులను బురిడీ కొట్టించి వారి వ్యక్తిగత సున్నితమైన వివరాలను తెలుసుకుంటారు. యూజర్లకు నమ్మకం కలిగేలా బ్యాంక్ అధికారులు లేదా ప్రతినిధులుగా నమ్మించి పక్కాగా మోసం చేస్తారు.


ఇక యూపీఐతో పాటు క్రెడిట్ కార్డులు, ఈ వ్యాలెట్స్ ను వాడే వారి డబ్బు దండుకునేందుకు కొందరు నేరగాళ్లు ఓటీపీ, పిన్ మోసాలకు దిగుతారు. బాధితులు పొరపాటు తమ పిన్ లేదా ఓటీపీలను బయటకు వెల్లడించిన సందర్భాల్లో నేరగాళ్లు వారి అకౌంట్లను స్వాధీనం చేసుకుని డబ్బు దోచుకుంటారు.

కాబట్టి, ఓటీపీ పిన్ లాంటి వాటిని ఎవరికీ చెప్పొద్దని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ పై అస్సలు క్లిక్ చేయకూడదు. ఫోన్ లో ఎవరు ఎలాంటి అభ్యర్థన చేసినా అస్సలు పట్టించుకోకూడదు. ఈ జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటిస్తే ఎలాంటి టెన్షన్ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్ బాట్: ఎలాన్ మస్క్

అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు సముద్రంలోనే ఎందుకు దిగుతారో తెలుసా..?

Read Latest and Technology News

Updated Date - Jul 24 , 2025 | 10:52 PM