Share News

ChatGPT-Therapist Privacy: చాట్‌జీపీటీతో పంచుకునే వ్యక్తిగత వివరాల గోప్యతపై గ్యారెంటీ లేదు.. శామ్‌ఆల్ట్‌మన్ స్పష్టీకరణ

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:12 PM

చాట్‌జీపీటీతో పంచుకునే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచే చట్టబద్ధమైన రక్షణలేవీ లేవని ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ చాట్స్‌ను బయటపెట్టాల్సి రావొచ్చని స్పష్టం చేశారు.

ChatGPT-Therapist Privacy: చాట్‌జీపీటీతో పంచుకునే వ్యక్తిగత వివరాల గోప్యతపై గ్యారెంటీ లేదు.. శామ్‌ఆల్ట్‌మన్ స్పష్టీకరణ
ChatGPT privacy concern

ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ వంటి చాట్‌బాట్స్ నిత్య జీవితంలో భాగమైపోతున్నాయి. మనుసులో బాధను విని సలహాలు చెప్పే నేస్తాలుగా మారిపోతున్నాయి. ఎవరికీ చెప్పుకోలేని అనేక సమస్యలను కొందరు చాట్‌జీపీటీతో పంచుకుని సాంత్వన పొందుతున్నారు. అది ఇచ్చే సలహాలతో సమస్యల నుంచి బయటపడుతున్నారు. అయితే, ఇలా షేర్ చేసుకునే సున్నితమైన వివరాలు ఎప్పటికీ గోప్యంగా ఉంటాయన్న గ్యారెంటీ ఏదీ లేదని చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. వైద్యులు, కౌన్సిలర్లు, థెరపిస్టులతో పంచుకునే సమాచారం గోప్యతపై లభించే చట్టబద్ధమైన రక్షణలేవీ చాట్‌జీపీటీ విషయంలో ఉండవని స్పష్టం చేశారు.

‘అత్యంత వ్యక్తిగత వివరాలను జనాలు చాట్‌జీపీటీతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా యువత చాట్‌జీపీటీని ఓ థెరపిస్టులా, లైఫ్ కోచ్‌లా చూస్తున్నారు. తమ బంధాలకు సంబంధించిన చిక్కుల నుంచి ఎలా బయటపడాలని అడుగుతున్నారు. సాధారణంగా థెరపిస్టులు, వైద్యులతో పంచుకునే ఇలాంటి వివరాలను బయటకు వెల్లడించకుండా చట్టబద్ధమైన రక్షణలు ఉన్నాయి. చాట్‌జీపీటీకి ఇవి వర్తించవు. కోర్టులు ఆదేశిస్తే ఈ వివరాలను తాము బయటపెట్టాల్సి రావచ్చు’ అని శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు.


‘అసలు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఏడాది వరకూ ఎవ్వరూ ఊహించలేదు. ఇది ఒక రకంగా పెద్ద చిక్కే. అయితే, థెరపిస్టు, వైద్యులకు సంబంధించిన గోప్యత చట్టాలను చాట్‌జీపీటీకీ వర్తింపచేయాలి’ అని శామ్ ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. కాపీరైట్ హక్కులకు సంబంధించి ఓపెన్ ఏఐపై కోర్టు కేసులు దాఖలయ్యాయి. ఇందులో భాగంగా యూజర్లు చాట్‌జీపీటీతో చేసే చాట్స్ అన్నిటినీ శాశ్వతంగా భద్ర పరచాలని న్యూయార్క్ టైమ్స్ పిటిషన్ దాఖలు చేసింది. యూజర్లు డిలీట్ చేసిన చాట్స్‌ను కూడా స్టోర్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో శామ్ ఆల్ట్‌మన్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఇవి కూడా చదవండి:

యూపీఐ యాప్స్ వాడతారా.. మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే

పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్ బాట్: ఎలాన్ మస్క్

Read Latest and Technology News

Updated Date - Jul 26 , 2025 | 11:12 PM