Share News

MIT AI Study: ప్రస్తుతమున్న ఈ జాబ్స్‌కు ఏఐతో ముప్పు.. ఎమ్ఐటీ అధ్యయనంలో వెల్లడి

ABN , Publish Date - Nov 27 , 2025 | 10:40 PM

అమెరికాలో ప్రస్తుతమున్న జాబ్స్‌లో 12 శాతం ఏఐతో భర్తీ చేయొచ్చని ఎమ్ఐటీ పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. 1.2 ట్రిలియన్‌ల వార్షిక ఆదాయం చెల్లించాల్సిన జాబ్స్ ఏఐతో భర్తీ చేయొచ్చని పరిశోధకులు తమ అధ్యయనంలో అంచనాకు వచ్చారు.

MIT AI Study: ప్రస్తుతమున్న ఈ జాబ్స్‌కు ఏఐతో ముప్పు.. ఎమ్ఐటీ అధ్యయనంలో వెల్లడి
AI Impact - Future of work

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతమున్న అనేక జాబ్స్‌కు ఏఐతో ముప్పు ఉందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తాజాగా జరిపిన అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ప్రస్తుతమున్న 12 శాతం ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయొచ్చని తేలింది. అమెరికాలోని దాదాపు 1000 రకాల వృత్తులను పరిశోధకులు విశ్లేషించారు. వీటికి కావాల్సిన నైపుణ్యాలు ప్రస్తుతం ఏఐ సాంకేతికతలకు ఏమేరకు ఉన్నాయో ముదింపు వేశారు. దీని ప్రకారం, 1.2 ట్రిలియన్ డాలర్ల వార్షిక వేతనాలు చెల్లించాల్సిన జాబ్స్‌ను ఏఐతో భర్తీ చేయొచ్చని తేల్చారు (AI impact on Jobs).

అయితే, ఈ అధ్యయనానికి అర్థం భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు ఉంటాయని కాదని స్పష్టం చేశారు. ఏఐ ప్రభావం ఇప్పటికే ఏ మేరకు విస్తరించిందో చెప్పడమే దీని ఉద్దేశ్యమని అన్నారు. లాజిస్టిక్స్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, ఆర్థిక సేవలను ఇప్పటికే ఏఐకి అప్పగిస్తున్న వైనాన్ని తెలియజేశారు. ఈ ఏఐ వ్యవస్థలకు డాక్యుమెంటేషన్, డాటా అనాలిసిస్, వర్క్ ఫ్లో ఆటోమేషన్‌ల సామర్థ్యాలు ఉన్నాయని తెలిపారు. ఇక హెల్త్‌కేర్ రంగంలో పేషెంట్ల షెడ్యూలింగ్, క్లెయిమ్ ప్రాసెసింగ్, ఇతరత్రా ఆఫీసు పనులను చక్కబెట్టగలిగే స్థాయిలో ఏఐ ఉందని అన్నారు. దీంతో, పేషెంట్‌లకు మరింత సమయాన్ని వైద్యులు కేటాయించే అవకాశం ఉంటుందని తెలిపారు.


ఆర్థిక సేవలపైనా ఏఐ ప్రభావం ఎక్కువేనని అన్నారు. టెక్‌ రంగంలో ఏఐతో మార్పులు అప్పుడే కనిపిస్తున్నాయని అధ్యయనం తేల్చింది. ప్రస్తుతమున్న మోడల్స్‌తో ఒక్క రోజులో కోట్ల కొద్దీ లైన్స్ ఉన్న కోడ్‌ను రాసే అవకాశం ఉంది. దీంతో, కంపెనీలు జూనియర్ ప్రోగ్రామర్లపై ఆధారపడటం తగ్గించుకుంటున్నాయి. రోజువారీ కార్యకలాపాల్లో ఏఐ ఎంతగా పెనవేసుకుపోతోందో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మా టీమ్‌కు రెస్టు కావాలి.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్

ఏఐతో మానసిక బంధంపై పర్‌ప్లెక్సిటీ సీఈఓ హెచ్చరిక

Read Latest and Technology News

Updated Date - Nov 28 , 2025 | 09:05 AM