Share News

Phone Charging-Overheating: చార్జింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే..

ABN , Publish Date - Aug 02 , 2025 | 07:26 AM

చార్జింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

Phone Charging-Overheating: చార్జింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే..
Phone Heating During Charging Fix

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్‌ అంటే నిత్యం వెంటే ఉండే ఓ నేస్తం. అయితే, వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చికాకులు ఎక్కువవుతాయి. ముఖ్యంగా చార్జింగ్ చేసే సమయంలో ఫోన్ ఎక్కువగా వేడెక్కుతోందంటే ఎవరికైనా కాస్త టెన్షన్‌గానే ఉంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం కోసం ఏం చేయాలో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

మీ స్మార్ట్ ఫోన్ కంపెనీ తయారు చేసిన చార్జర్ లేదా ఆమోదం పొందిన చార్జర్‌ను మాత్రమే వాడాలి. ఫోన్ బ్యాటరీ చార్జర్‌కు అనుగుణంగా లేని చార్జర్ లేదా తక్కువ నాణ్యత ఉన్న చార్జర్ వాడితే ఫోన్ అసాధారణ స్థాయిలో హీటెక్కే ప్రమాదం ఉంది.

ఫోన్ చార్జింగ్‌లో ఉన్నప్పుడు దాన్ని వినియోగించకూడదు. చార్జింగ్‌లో ఉండగా మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియో కాల్స్ చేయడం వంటి పనులతో ఫోన్‌ ప్రాసెసర్‌, బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, ఇలాంటి పనులు చేయకుండా ఉంటే త్వరగా బ్యాటరీ చార్జ్ అవుతుంది.

చార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ కేసును తొలగిస్తే ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. చాలా సందర్భాల్లో కేస్ వల్లనే ఫోన్ అతిగా వేడేక్కుతుంటుందని నిపుణులు చెబుతున్నారు.


చార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ను బెడ్స్, సోఫాలు, దిండ్లపైన లేదా కింద అస్సలు పెట్టకూడదు. టేబుల్, లేదా నేలపై పెడితే బాగా గాలి పారి ఫోన్ చల్లబడుతుంది.

ఇక చార్జింగ్ సమయంలో బ్లూ టూత్, వైఫై, జీపీఎస్ వంటి వాటిని ఆపుచేయాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే యాప్స్‌ను కూడా క్లోజ్ చేయాలి. ఉష్ణానికి కారణమయ్యే ఈ ఫీచర్స్ వల్ల ఫోన్ మరింత వేడెక్కే అవకాశం ఉంది.

ప్రస్తుతం అనేక ఫోన్‌లల్లో బ్యాటరీ సేవర్ మోడ్ అందుబాటులో ఉంది. చార్జింగ్ సమయంలో ఈ ఆప్షన్‌ను ఆన్ చేస్తే బ్యాక్ గ్రౌండ్‌లో నడిచే యాప్‌లన్నీ ఆగిపోతాయి. ఫోన్ అంతగా వేడెక్కదు. చార్జింగ్ తరువాత మళ్లీ ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో చార్జింగ్ మరింత ప్రయోజనకరం

ఫోన్‌ను తరచూ చార్జ్ చేయడం వల్ల కూడా ఇలా వేడెక్కే అవకాశం ఉంది. కాబట్టి, అవసరమైన సందర్భంలో మాత్రమే ఫోన్‌ను చార్జ్ చేసుకోవాలి. ఫోన్ మరీ వేడెక్కకుండా ఉండేందుకు స్టాండర్డ్ చార్జింగ్‌నే ఎంచుకోవాలి.


బ్యాటరీ పర్‌ఫార్మెన్స్‌ను మెరుగుపరిచేందుకు, ఓవర్‌ చార్జింగ్‌ను నిరోధించేందుకు ఫోన్ తయారీదార్లు తరచూ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను ఇస్తుంటారు. వీటిని కచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇబ్బందులు చాలా వరకూ తొలగిపోతాయి. ఇక అవసరమైన సందర్భాల్లో పాత బ్యాటరీని తొలగించి కొత్త బ్యాటరీని వాడితే హీటింగ్ బెడద ఉండదు.

ఇవి కూడా చదవండి:

చాట్‌జీపీటీతో పంచుకునే వ్యక్తిగత వివరాల గోప్యతపై గ్యారెంటీ లేదు.. శామ్‌ఆల్ట్‌మన్ స్పష్టీకరణ

యూపీఐ యాప్స్ వాడతారా.. మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే

Read Latest and Technology News

Updated Date - Aug 02 , 2025 | 07:32 AM