Sundar Pichai: మా టీమ్‌కు రెస్టు కావాలి.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:47 PM
తమ తాజా ఏఐ మోడల్ జెమినై-3 విడుదల కోసం గూగుల్ ఇంజనీర్లు కంటి మీద కునుకు లేకుండా శ్రమించారని సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. వాళ్లకు ప్రస్తుతం కాస్త నిద్ర అవసరమని సరదా వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే గూగుల్ సంస్థ.. అత్యాధునిక జెమినై-3 ఏఐ మోడల్‌ను విడుదల చేసింది. అద్భుత సామర్థ్యాలు కలిగిన ఈ ఏఐ మోడల్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఇతర ఏఐ కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జెమినై-3 విడుదలతో ఏఐ రేసులో గూగుల్ టాప్ స్పాట్‌కు చేరుకున్నట్టైంది. ఈ ఏఐ మోడల్ రిలీజ్ కోసం అవిశ్రాంతంగా పని చేసిన గూగుల్ ఇంజనీర్‌లపై సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రశంసల వర్షం కురిపించారు (Sundar Pichai on Gemini-3).
గూగుల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లో సుందర్ పిచాయ్ జెమినై లాంచ్‌పై స్పందించారు. ఈ మోడల్ రిలీజ్‌కు ముందు గూగుల్ టీమ్స్ చాలా కష్టపడ్డాయని అన్నారు. కొందరైతే కంటిమీద కునుకుకు కూడా దూరమయ్యారని నవ్వుతూ అన్నారు. ‘వాళ్లకు ప్రస్తుతం కంటి నిండా నిద్ర కావాలి’ అని సరదాగా అన్నారు. ఇక తామందరికీ కాస్తంత రెస్టు దొరుకుతుందనే అనుకుంటున్నట్టు తెలిపారు (Google Engineers' sleepless Work).
జెమినై-3 సామర్థ్యాలు అద్భుతంగా ఉండటంతో ఏఐ రంగంలో ఒక్కసారిగా మళ్లీ పోటీ పెరిగినట్టైంది. ఈ మోడల్ లాంఛ్ తరువాత గూగుల్ మార్కెట్ విలువ ఏకంగా 12 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం సంస్థ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరువైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సంస్థ మార్కెట్ విలువ దాదాపు 70 శాతం మేర పెరగడం కొసమెరుపు.
ఇటీవల కాలంలో ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ సంస్థలు ఏఐ రేసులో దూసుకుపోతున్నాయి. ఫలితంగా గూగుల్ తన ప్రత్యర్థులకంటే వెనకబడిందన్న కామెంట్స్ ఎక్కువయ్యాయి. ఇలాంటి టైమ్‌లో జెమినై-3 రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రముఖ టెక్ సంస్థలు కూడా ఈ ఏఐ మోడల్ సామర్థ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. ఇక సేల్స్‌ఫోర్స్ సంస్థ సీఈఓ అయితే తన ఆనందాన్ని అణుచుకోలేకపోయారు. ఏఐ రంగంలో ఇది అద్భుత పురోగతి అని ప్రశంసించారు. జెమినై-3ని రెండు గంటల పాటు వాడి చూశానని, ఇక చాట్‌జీపీటీ వైపు మళ్లే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి
Microsoft Agentic OS వస్తోందంటూ మైక్రోసాఫ్ట్ విండోస్ చీఫ్ ప్రకటన.. మండిపడుతున్న జనాలు
ఏఐతో మానసిక బంధంపై పర్‌ప్లెక్సిటీ సీఈఓ హెచ్చరిక
Read Latest and Technology News