Share News

Extend Battery Life: మీ ఫోన్‌లో చార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్‌‌తో సమస్యకు పరిష్కారం

ABN , Publish Date - Jul 13 , 2025 | 08:08 PM

ఫోన్ పాతబడే కొద్దీ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. చార్జింగ్ త్వరగా అయిపోతుంది. కొన్ని చిట్కాలతో ఈ పరిస్థితి నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Extend Battery Life: మీ ఫోన్‌లో చార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్‌‌తో సమస్యకు పరిష్కారం
phone battery tips

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్ పాతబడే కొద్దీ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. రోజుకు రెండు మూడు సార్లు చార్జింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎందరో వినియోగదారులు ఎదుర్కునే సమస్య. ఇలాంటప్పుడు తొందర పడి కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని టిప్స్ పాటించి బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చని అంటున్నారు (phone battery tips).

బ్యాటరీ చార్జింగ్‌లో అధిక శాతాన్ని స్క్రీన్‌యే (Phone Screen) వినియోగిస్తుంది. స్క్రీన్‌‌ను పూర్తి బ్రైట్‌నెస్‌లో పెడితే బ్యాటరీ త్వరగా అయిపోతుంది. కాబట్టి, దీన్ని మాన్యువల్‌గా తగ్గించాలి. ఆటో బ్రైట్‌నెస్‌‌ను ఎంచుకునే బదులు మాన్యువల్‌గా దీన్ని సెట్ చేసుకుంటేనే మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం సమయాల్లో నైట్ మోడ్ ఆన్ చేయడం లేదా బ్లూ లైట్ ఫిల్టర్‌ను ఆన్ చేయడం కూడా బ్యాటరీపై భారాన్ని తగ్గిస్తుందని అంటున్నారు. ఫోన్‌ను వాడని సందర్భంలో 30 సెకెన్ల తరువాత స్క్రీన్ దానంతట అదే ఆఫ్ అయిపోయే స్క్రీన్ టైమ్ అవుట్ సెట్ చేసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు.


స్మార్ట్‌ ఫోన్‌లోని కొన్ని యాప్స్ కూడా బ్యాటరీని అధికంగా వినియోగిస్తుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, లొకేషన్ సర్వీసును వినియోగించే యాప్స్ విద్యుత్ వినియోగం ఎక్కువ. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏయే యాప్స్ ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాయో తెలుసుకోవాలి. సెట్టింగ్స్‌ ఆప్షన్స్‌లోని బ్యాటరీ యూసేజ్ ద్వారా ఈ విషయాలు తెలుసుకోవచ్చు. ఆ తరువాత యాప్‌ల బ్యాక్‌గ్రౌండ్ రిఫ్రెష్‌ను డిసేబుల్ చేయడం లేదా బ్యాక్‌గ్రౌండ్ డాటాను రెస్ట్రిక్ట్ చేయడం వంటివి చేస్తే ఫలితం ఉంటుంది.


బ్యాటరీ లైఫ్ పెరిగేందుకు వీలుగా ఆప్టిమైజ్డ్ బ్యాటరీ చార్జింగ్, అడాప్టివ్ బ్యాటరీ వంటి ఫీచర్లను యాక్టివేట్ చేయాలి. ఫోన్‌ను బ్యాటరీ సేవర్ మోడ్‌లో పెట్టుకోవాలి. ఫోన్ మరీ వేడెక్కకుండా జాగ్రత్త తీసుకోవాలి. మందపాటి కేసింగ్ ఏదైనా ఉంటే వెంటనే తీసేయాలి. రాత్రంతా ఫోన్‌ను చార్జ్ చేయకూడదు. బ్యాటరీ చార్జి 80 లేదా 90 శాతానికి చేరుకోగానే ఫోన్ చార్జింగ్‌ను ఆపేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చార్జింగ్ ఎక్కువ సేపు నిలిచి ఉండి అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

పవర్ బ్యాంక్ కొనాలనుకునేవారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

మీ ఫోన్‌కు హ్యాకింగ్ బెడద వద్దనుకుంటే ఈ టిప్స్ తప్పనిసరిగా పాటించాలి

Read Latest and Technology News

Updated Date - Jul 13 , 2025 | 08:18 PM