Share News

Sridhar Vembu: టాప్ 100 యాప్స్‌ జాబితాలో అరట్టైకి దక్కని చోటు.. స్పందించిన శ్రీధర్ వెంబు

ABN , Publish Date - Nov 13 , 2025 | 03:22 PM

టాప్ 100 యాప్స్ జాబితాలో అరట్టై యాప్‌కు చోటుదక్కకపోవడంపై జోహో కార్పొరేషన్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు తాజాగా స్పందించారు. ఇది సర్వసాధారణమైన పరిణామమేనని అన్నారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళుతున్న తాము స్వల్పకాలిక మార్పులపై పెద్దగా ఆందోళన చెందమని అన్నారు.

Sridhar Vembu: టాప్ 100 యాప్స్‌ జాబితాలో అరట్టైకి దక్కని చోటు.. స్పందించిన శ్రీధర్ వెంబు
Arattai Loses Place In Top 100 Apps List

ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ ప్లే స్టోర్ టాప్ యాప్స్‌ లిస్టులోకి ఇటీవల దూసుకొచ్చిన అరట్టైకి కాస్త డిమాండ్ తగ్గినట్టు కనిపిస్తోంది. తాజాగా టాప్ 100 యాప్స్‌ లిస్టులో అరట్టైకి స్థానం దక్కలేదు. ఈ పరిణామంపై జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) స్పందించారు. కొత్త ఉత్పత్తులు కస్టమర్లకు చేరువయ్యే క్రమంలో సాధారణ పరిణామమే ఇదని కామెంట్ చేశారు. దీన్ని భూతద్దంలో చూస్తూ విమర్శకులు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు (Arattai Loses Place in Top 100 Apps List).

‘ఇక్కడ పెద్ద తప్పు జరిగిందేమీ లేదు. అసలు ఏదో తప్పు జరుగుతోందన్న ఆలోచనలోనే తప్పు ఉంది. వాణిజ్య కార్యకలాపాల్లో ఇది సాధారణంగా జరిగేదే. హెచ్చుతగ్గులు సర్వసాధారణం. ఒక్కసారిగా ఉన్నత స్థితికి వెళ్లడం సాధ్యం కాదు’ అని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లే సంస్థలే మార్కెట్‌లో మనగలుగుతాయని అన్నారు.


‘దీర్ఘకాలిక దృక్కోణం ఉండటమే ముఖ్యం. అలాంటి వారే ఎక్కువ కాలం మనగలుగుతారు. నెం.1 స్థానమే గొప్పదని నేను ఎప్పుడూ అనుకోను. ఎలాంటి పరిస్థితులైనా కాలంతో పాటు కనుమరుగవుతాయని నేను మా ఉద్యోగులకు ఎప్పుడూ చెబుతుంటాను. కాబట్టి, ఇలాంటి పరిణామాలపై నేను పెద్దగా స్పందించను. వీటిపై దృష్టిపెట్టి హేళన చేసే వారు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నట్టే’ అని అన్నారు. తమకు అరట్టై అంటే స్వల్పకాలిక ప్రాజెక్టు కాదని, దాదాపు 15 ఏళ్లకు పైగా కాలపరిమితి గల అంశంగా చూస్తున్నామని అన్నారు.

మెసేజింగ్ టెక్నాలజీపై జోహో దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించిందని శ్రీధర్ వెంబు గుర్తు చేశారు. కాబట్టి, ఈ ఒక్క నెలలో హెచ్చుతగ్గులు తమను పెద్దగా ప్రభావితం చేయవని స్పష్టం చేశారు. మెసేజింగ్‌ రంగంలో గుత్తాధిపత్య పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు విశ్వసనీయ ఉత్పత్తుల నుంచి పోటీ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి

ఏఐతో మానసిక బంధంపై పర్‌ప్లెక్సిటీ సీఈఓ హెచ్చరిక

ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే

Read Latest and Technology News

Updated Date - Nov 13 , 2025 | 04:20 PM