AI Companions: ఏఐతో మానసిక బంధంపై పర్‌ప్లె్క్సిటీ సీఈఓ హెచ్చరిక
ABN , Publish Date - Nov 10 , 2025 | 10:21 PM
ఏఐ నేస్తాలతో అప్రమత్తంగా ఉండాలని పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇలాంటి బంధాలతో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి తరంలో కొందరు ఏఐతో మానసిక బంధాన్ని పెనవేసుకోవడం, ఏఐని గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్‌గా భావించడంపై పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని పోల్స్కీ సెంటర్‌లో ఆయన తాజాగా ప్రసంగించారు. ఏఐ భాగస్వాములతో బంధాలు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇలాంటి వారు భ్రమల్లో జీవిస్తారని తెలిపారు (AI Companions Mental Health).
మనుషుల రీతిలో సంభాషణలు జరిపేలా ఏఐ సాంకేతికత ప్రస్తుతం అభివృద్ధి చెందిందని అన్నారు. యూజర్లతో జరిపిన పాత సంభాషణలను కూడా నేటి ఏఐ సాంకేతికత గుర్తుపెట్టుకుని, అందుకు అనుగుణంగా సమాధానాలు ఇవ్వగలదని చెప్పారు. ‘చాలా మంది వాస్తవ ప్రపంచాన్ని బోర్‌గా ఫీలవుతున్నారు. ఏఐ చాట్‌బాట్‌లతో గంటల తరబడి సంభాషణలు జరుపుతున్నారు. ఇలాంటి అనుభవాలు ప్రజల ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చేస్తాయి. వారి చుట్టూ ఓ ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని సృష్టిస్తాయి. చివరకు ఇలాంటి వారు సులువుగా ఇబ్బందుల్లో చిక్కుకుంటారు’ అని ఆయన హెచ్చరించారు.
ఏఐ నేస్తాలను రూపొందించే ఉద్దేశం తమకు లేదని పర్‌ప్లెక్సిటీ సీఈఓ తెలిపారు. విశ్వసనీయమైన తాజా సమాచారం అందించే ఏఐ సాధనాలను రూపొందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. టెక్నాలజీ ఆధారంగా ప్రజలు అభివృద్ధి సాధించే విధంగా భవిష్యత్తు ఉండాలనేదే తమ ఆశయమని చెప్పారు.
మార్కెట్‌లో ఇప్పటికే పలు ఏఐ కంపానియన్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కొందరు మానసిక సాన్నిహిత్యం కోసం ఈ వర్చువల్ భాగస్వాములను ఆశ్రయిస్తున్నారు. గ్రోక్ -4 మోడల్ ద్వారా వర్చువల్ స్నేహితులతో చాట్ చేసే అవకాశాన్ని ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎక్స్ఏఐ ఆఫర్ చేస్తోంది. సమాజంలో ఇలాంటి మార్పులు రావడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఒంటరితనంతో బాధపడే వారు వర్చువల్ స్నేహితులతో సాంత్వన పొందడంలో తప్పేమీ లేదని వాదించే వారు కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే
భారీ స్థాయిలో హ్యాకింగ్.. 183 మిలియన్‌లకు పైగా పాస్‌వర్డ్స్ లీక్!
Read Latest and Technology News