Virat Kohli Retirement: అప్పుడే కోహ్లీ రిటైర్‌మెంట్: ఏబీడీ
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:05 PM
కృతజ్ఞతలు అందుకునేందుకు విరాట్ అర్హుడని ఏబీడీ అన్నాడు. అతడిలో మరో ఐదేళ్లు క్రికెట్ ఆడగల సత్తా ఉందని.. కోహ్లీ 2027 వరల్డ్ కప్ తర్వాతే తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని తన అభిప్రాయమని వెల్లడించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. తన అంతర్జాతీయ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన విరాట్.. మూడో వన్డేలో ఫామ్‌ను అందుకున్నాడు. ఇక ‘విరాట్ రిటైర్ అయ్యే టైం వచ్చింది’ అని కొందరు అంటుంటే.. ‘ఈ వన్డే తర్వాత కోహ్లీ కనిపించడు’ అంటూ మరికొందరు విమర్శలు చేస్తూనే వచ్చారు. వారందరికీ మూడో వన్డేలో 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచి బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) విరాట్‌కు మద్దతుగా నిలిచాడు.
‘విరాట్‌ను సెలబ్రేట్ చేసుకోనివ్వండి. అతడి లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోనివ్వండి. కృతజ్ఞతలు అందుకునేందుకు విరాట్ అర్హుడు. నాకు తెలిసి అతడిలో మరో ఐదేళ్లు క్రికెట్ ఆడగల సత్తా ఉంది. కోహ్లీ 2027 వరల్డ్ కప్ తర్వాతే తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని నా అభిప్రాయం. యదావిథిగా ఐపీఎల్(IPL)లో కొనసాగుతాడు. అతడు మరో మూడు లేదా నాలుగేళ్ల పాటు.. కుదిరితే ఐదేళ్లు మనకు మైదానంలో కనిపిస్తాడు. ఐపీఎల్ కంటే కూడా ప్రపంచ కప్ సన్నద్ధతకు చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది.
జట్టులో విరాట్‌కు ఎంతో ప్రముఖ పాత్ర ఉంది. జట్టులో కోహ్లీ ఉన్నాడంటే చాలు.. మిగతా యువ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉంటారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇతర ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరో విషయం ఏంటంటే.. వారు కొన్నిసార్లు బ్యాట్‌తో రాణించలేకపోయినా.. జట్టు మీద తమదైన ముద్ర వేయగలరు’ అని ఏబీడీ వివరించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్