Share News

Shubman Gill: గిల్.. బెన్‌‌స్టోక్స్‌ను అలా అడగడానికి భయమెందుకు.. సునీల్ గవాస్కర్ సూటి ప్రశ్న

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:46 PM

చివరి రోజు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలను అడ్డుకునేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన డ్రా ఎత్తులను కూడా టీమిండియా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కొన్ని సూచనలు చేశాడు.

Shubman Gill: గిల్.. బెన్‌‌స్టోక్స్‌ను అలా అడగడానికి భయమెందుకు.. సునీల్ గవాస్కర్ సూటి ప్రశ్న
Ben Stokes and Shubman Gill

మాంఛెస్టర్‌ టెస్ట్‌లో ఓటమి అంచు నుంచి అద్భుతంగా పుంజుకున్న టీమిండియా ఇంగ్లండ్‌కు షాకిచ్చింది (Ind vs Eng). గెలుపు తమదే అని ధీమాగా ఉన్న ఇంగ్లండ్ చివరకు డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి రోజు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలను అడ్డుకునేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) వేసిన డ్రా ఎత్తులను కూడా టీమిండియా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కొన్ని సూచనలు చేశాడు. ప్రత్యర్థి పట్ల కాస్త కటువుగా ఉండడాన్ని గిల్ (Shubman Gill) నేర్చుకోవాలని గవాస్కర్ సూచించాడు.


'మాంఛెస్టర్‌లో టీమిండియా బ్యాటర్లు స్పందించిన తీరు అద్వితీయం. నాకెంతో సంతృప్తిని కలిగించింది. తీవ్ర ఒత్తిడిలో వారు ఆడిన తీరు అద్భుతం. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ ప్రగల్భాలు ఈ సిరీస్‌లో శ్రుతి మించాయి. రెండో టెస్ట్‌లో టీమిండియా 600 పైచిలుకు పరుగులను టార్గెట్‌గా నిర్దేశిస్తే భయపడ్డారని కొందరు వ్యాఖ్యానించారు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 336 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజా టెస్ట్‌లో ఇంగ్లండ్ ఎందుకు అంత ఎక్కువ సమయం ఆడింది. ఇంగ్లండ్ త్వరగా డిక్లేర్ చేసి ఉంటే ఫలితం వచ్చి ఉండేదేమో' అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.


'నేనే కనుక గిల్ స్థానంలో ఉంటే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను కొన్ని ప్రశ్నలు అడిగేవాడిని. మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ఎందుకు రాలేదో అర్థం కాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఎందుకు 311 పరుగుల ఆధిక్యం వరకు తీసుకెళ్లావు? కనీసం నీ సెంచరీ తర్వాతైనా డిక్లేర్ చేసి ఉంటే మీ బౌలర్లకు మరో గంట సమయం అదనంగా దొరికేది కదా అని స్టోక్స్‌ను గిల్ ప్రశ్నించాల్సింది. అయితే గిల్ అలా అడగలేడు. అతడు మరీ సున్నితంగా ఉండే వ్యక్తి. స్టోక్స్‌ను ఆ ఎస్‌జీ (శుభ్‌మన్ గిల్) అడగకపోయినా, ఈ ఎస్‌జీ (సునీల్ గవాస్కర్) అడుగుతున్నాడు' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి..

ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 03:46 PM