Pak Vs Sri ODI: భద్రతా సమస్యలు.. పాక్ నుంచి తిరిగెళ్లిపోనున్న శ్రీలంక క్రికెటర్లు
ABN , Publish Date - Nov 12 , 2025 | 10:55 PM
ఇస్లామాబాద్‌లో పేలుడు ఘటన నేపథ్యంలో శ్రీలంక ప్లేయర్లు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వన్డే సిరీస్ కోసం పాక్‌లో పర్యటిస్తున్న వారు సొంత దేశానికి తిరిగెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనతో శ్రీలంక క్రికెటర్లు కొందరు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటిస్తోంది. ఇస్లామాబాద్ పేలుడు ఘటన నేపథ్యంలో 8 మంది శ్రీలంక క్రికెటర్లు సొంత దేశానికి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారట. వారి స్థానంలో కొత్త వారిని శ్రీలంక బోర్డు పాక్‌కు పంపించేందుకు రెడీ అయ్యిందని సమాచారం. ఈ నేపథ్యంలో రావల్పిండిలో జరగాల్సిన తదుపరి మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
మంగళవారం జరిగిన తొలి వన్డేలో పాక్ శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రావల్పిండిలో ఈ మ్యాచ్ జరిగింది. అదే సమయంలో పేలుడు విషయం వెలుగులోకి వచ్చినా మ్యాచ్‌ను కొనసాగించారు. ఇస్లామాబాద్ పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్ల భద్రత ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లు గురు, శనివారాల్లో జరగాల్సి ఉంది. రెండు మ్యాచ్‌లనూ రావల్పిండిలోనే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు శ్రీలంక ప్లేయర్లు తిరిగి వెళ్లిపోయేందుకు నిర్ణయించడం పాక్‌కు తలవంపులుగా మారింది.
పాక్ రాజధానిలో మంగళవారం ఈ బాంబు దాడి జరిగింది. పేలుడు ధాటికి ఓ కోర్టు కాంప్లెక్స్ పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. 27 మంది గాయాలపాలయ్యారు. ఇది ఆత్మాహుతి దాడి అని స్థానిక మీడియా పేర్కొంది. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహసీన్ నఖ్వీ ప్రకటన ప్రకారం, బాంబులతో ఓ వ్యక్తి కోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి చివరకు బయటే తనని తాను పేల్చేసుకున్నాడు. అంతకుముందు 15 నిమిషాల పాటు అక్కడే వేచి చూసి ఆ తరువాత ఈ దాడికి పాల్పడ్డట్టు మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ వేలం.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే..
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి