Share News

Tennis Final: ఫైనల్లో సినర్‌, అల్కారజ్‌

ABN , Publish Date - Jul 12 , 2025 | 02:46 AM

డబుల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌, ప్రపంచ రెండో ర్యాంకర్‌ కార్లోస్‌ అల్కారజ్‌ వరుసగా మూడో వింబుల్డన్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు.

Tennis Final: ఫైనల్లో సినర్‌, అల్కారజ్‌

  • సెమీఫైనల్లో జొకోవిచ్‌కు ఝలక్‌

లండన్‌: డబుల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌, ప్రపంచ రెండో ర్యాంకర్‌ కార్లోస్‌ అల్కారజ్‌ వరుసగా మూడో వింబుల్డన్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. స్పెయిన్‌కు చెందిన రెండోసీడ్‌ అల్కారజ్‌ ఫైనల్లో అడుగు పెట్టాడు. ఆదివారం జరిగే తుదిపోరులో ప్రపంచ నెంబర్‌వన్‌ యానిక్‌ సినర్‌ (ఇటలీ)తో అమీతుమీ తేల్చుకుంటాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో అల్కారజ్‌ 6-4, 5-7, 6-3, 7-6 (6)తో ఐదో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై గెలుపొందాడు. రెండో సెమీస్‌లో టాప్‌సీడ్‌ సినర్‌ 6-3, 6-3, 6-4తో వరుస సెట్లలో ఆరో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు షాకిచ్చాడు. తద్వారా 23 ఏళ్ల సినర్‌ తొలిసారి వింబుల్డన్‌ ఫైనల్లో ప్రవేశించాడు. ఏడుసార్లు వింబుల్డన్‌ విజేత జొకో.. సినర్‌కు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక పోయాడు. గంటా 55 నిమిషాల పోరులో ఒక్క సెట్‌ కూడా నెగ్గలేకపోయాడు. దీంతో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గాలన్న 38 ఏళ్ల జొకోవిచ్‌ కల మరోసారి కలగానే మిగిలిపోయింది.

ఇక ఈ వింబుల్డన్‌ ఫైనల్‌..ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ ఫైట్‌ను పునరావృతం చేయనుంది. ఐదు సెట్లపాటు హోరాహోరీగా సాగిన రొలాండ్‌ గారోస్‌ ఫైనల్లో సినర్‌పై 22 ఏళ్ల అల్కారజ్‌ గెలిచాడు. కాగా..వింబుల్డన్‌ సెమీస్‌ గెలుపుతో అల్కారజ్‌ వరుస విజయాల సంఖ్య 24కి చేరడం విశేషం.

Updated Date - Jul 12 , 2025 | 02:46 AM