Suryakumar Yadav: శ్రేయస్ ఆరోగ్యం నిలకడగానే ఉంది: సూర్యకుమార్
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:31 PM
ఆస్ట్రేలియాతో వన్డేలో గాయపడిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉందని సూర్య కుమార్ యాదవ్ తెలిపారు. ఫిజియో వేగంగా స్పందించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్(Shreyas Iyer injury) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో కిందపడిపోయాడు. అతడి పక్కటెముకలు నేలకు బలంగా తాకడంతో అతడి ప్లీహానికి తీవ్ర గాయమైంది. అంతర్గత రక్తస్రావం కావడం వల్ల శ్రేయస్‌ను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav).. శ్రేయస్ గాయంపై కీలక విషయాలు వెల్లడించాడు.
‘శ్రేయస్ గాయపడ్డాడని తెలిసిన వెంటనే అతడికి ఫోన్ చేశాను. కానీ మొబైల్ అతడి దగ్గర లేదని తెలిసింది. మళ్లీ వెంటనే ఫిజియో కమలేశ్ జైన్‌కు ఫోన్ చేసి మాట్లాడాను. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పాడు. అయ్యర్‌తో కూడా మాట్లాడించాడు. గత రెండు రోజులుగా అయ్యర్ నాతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. కొన్ని రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నాడు. ప్రస్తుతం శ్రేయస్ అందరికీ స్పందిస్తున్నాడు. అందరితోనూ మాట్లాడుతున్నాడు. ఇది మంచి విషయం’ అని సూర్య వ్యాఖ్యానించాడు. మరోవైపు టీమిండియా ఫిజియోలను బీసీసీఐ(BCCI) చీఫ్ ప్రత్యేకంగా అభినందించారు. వారు వేగంగా స్పందించి ఆసుపత్రికి తరలించడం వల్లే అయ్యర్‌కు ప్రాణాపాయం తప్పిందని అన్నారు.
రీఎంట్రీ అప్పుడేనా..?
శ్రేయస్ అయ్యర్‌కు అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ప్లీహం గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో శ్రేయస్ మైదానంలో బ్యాట్ పట్టేందుకు సుదీర్ఘ సమయమే పట్టనుంది. దీని ప్రకారం ఐపీఎల్ 2026(IPL 2026)లో శ్రేయస్ మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇవీ చదవండి:
ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49శాతం విదేశీ పెట్టుబడులు
Sensex Rise: సెన్సెక్స్ 567 పాయింట్లు అప్