Basketball Player Death: బాస్కెట్‌బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ 16 ఏళ్ల నేషనల్ ప్లేయర్ దుర్మరణం
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:17 PM
16 ఏళ్ల యువ క్రీడాకారుడు. ఇటీవలే నేషనల్ టీంలోకి సెలక్ట్ అయ్యాడు. దీని కోసం స్థానిక బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్రాక్రీస్ చేస్తుండగా, ఒక్క సారిగా ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: బాస్కెట్‌బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఓ యువ క్రీడాకారుడు ఘోర ప్రమాదానికి గురయ్యాడు. హర్యానా రాష్ట్రంలోని రోథక్‌లో బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ దారుణం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో 16 ఏళ్ల హార్దిక్ అనే జాతీయ స్థాయి ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక లఖన్ మజ్రా ప్రాంతంలోని బాస్కెట్‌బాల్ కోర్టులో ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘోరం జరిగింది.
ఈ ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌లో నిక్షిప్తమయ్యాయి. హార్దిక్ మూడవ పాయింట్ లైన్ నుంచి దూసుకెళ్లి, బాస్కెట్‌ను తాకి వెనక్కి వచ్చాడు. అయితే, రెండోసారి అలాగే ప్రయత్నిస్తూ రింగ్ పట్టుకున్నాడు. అంతే, ఉన్నఫళంగా బాస్కెట్‌బాల్ పోల్ విరిగిపోయి హార్థిక్ ఛాతీ మీద పడిపోయింది.
సమీపంలో ఉన్న అతని స్నేహితులు వెంటనే పోల్‌ను ఎత్తి, హార్దిక్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలతో ఉన్న హార్థిక్‌ను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, అధిక రక్త స్రావం కావడంతో ఆస్పత్రిలో హార్దిక్ ప్రాణాలొదిలాడు. పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టం చేసి కుటుంబానికి అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇటీవలే నేషనల్ బాస్కెట్ బాల్ టీంకి ఎంపికైన హార్థిక్ హఠాన్మరణం అందరినీ కలచివేస్తోంది.
ఇది మాత్రమే కాదు, హర్యానా రాష్ట్రంలోని మరో జిల్లా బహదూర్‌గఢ్‌లో కూడా ఇదే విధమైన దుర్ఘటన జరిగింది. 15 ఏళ్ల ఆమన్ అనే 10వ తరగతి విద్యార్థి, స్థానిక స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా బాస్కెట్‌బాల్ పోల్ అతని మీద పడిపోయింది. తీవ్రమైన ఇంటర్నల్ ఇంజ్యూరీస్‌తో రోథక్‌లోని పండిత్ భగవత్‌దయాల్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎమ్స్)లో చికిత్స పొందుతూ ఆమన్ మరణించాడు. ఆమన్ ఇటీవల తన స్కూల్ వార్షిక క్రీడా పోటీల్లో మెడల్ సాధించాడు.
ఈ వరుస దుర్ఘటనలు.. హర్యానా రాష్ట్రంలోని ప్రభుత్వ స్పోర్ట్స్ మౌలిక సదుపాయాల నిర్వహణపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించే హర్యానా రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదాలు ఆటగాళ్ల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అధికారులు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని క్రీడాకారులు, నిపుణులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు
మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
Read Latest Telangana News and National News