IPL 2025 RR vs GT: కుర్రాడు కొట్టేశాడు.. గుజరాత్ భారీ టార్గెట్‌ను ఊదేసిన వైభవ్
ABN , Publish Date - Apr 28 , 2025 | 10:58 PM
ఐపీఎల్‌లో అద్భుతం చోటు చేసుకుంది. 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 101 పరుగులు) ఎవరికీ సాధ్యం కాని రికార్డులను తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ చేశాడు. అలాగే ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన తొలి ఇండియన్‌గా నిలిచాడు.

ఐపీఎల్ (IPL 2025)లో అద్భుతం చోటు చేసుకుంది. 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 101 పరుగులు) ఎవరికీ సాధ్యం కాని రికార్డులను తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ చేశాడు. అలాగే ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన తొలి ఇండియన్‌గా వైభవ్ (Vaibhav Suryavanshi) నిలిచాడు. సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన భారీ లక్ష్యం సులభంగా కరిగిపోయింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో (GT vs RR) జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పరాగ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ గుజరాత్ బ్యాటర్లు రెచ్చిపోయారు. శుభ్‌మన్ గిల్ (84)తో పాటు మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (39) తన ఫామ్‌ను కొనసాగించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. సుదర్శన్ అవుట్ అయిన తర్వాత వచ్చిన జాస్ బట్లర్ (50) కూడా బౌండరీలతో ఆర్‌ఆర్ బౌలర్లను బెంబేలెత్తించాడు. సెంచరీకి చేరువవుతున్న సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించి గిల్ అవుటయ్యాడు. దీంతో జీటీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.
గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఊదేశాడు. ఏకంగా 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో వేగవంతమైన సెంచరీ చేసి వార్‌ను వన్‌సైడ్‌గా మార్చేశాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (70 నాటౌట్) కూడా అర్ధశతకంతో మెరిశాడు. సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత వచ్చిన నితీష్ రాణా (4) వెంటనే అవుటయ్యాడు. తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (32) రాణించాడు. దీంతో రాజస్తాన్ మరో 4.1 ఓవర్లు మిగిలి ఉండగానే 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..