England vs India: ఇక.. బ్యాటర్లదే భారం
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:07 AM
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు సైతం రసవత్తరంగా సాగుతోంది. బౌలర్లు హవా చూపిన రెండో

లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు సైతం రసవత్తరంగా సాగుతోంది. బౌలర్లు హవా చూపిన రెండో రోజు ఆటలో ఏకంగా 15 వికెట్లు నేలకూలడం విశేషం. మరోవైపు ఇంగ్లండ్ బాజ్‌బాల్ ఆటకు భారత పేసర్లు ప్రసిద్ధ్ క్రిష్ణ (4/62), సిరాజ్ (4/86) ముకుతాడు వేయగా.. వారికి దక్కిన ఆధిక్యం కేవలం 23 పరుగులు మాత్రమే. ఇక చివరి సెషన్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ (51 బ్యాటింగ్) ఎదురుదాడికి దిగాడు. దీంతో శుక్రవారం వెలుతురులేమితో ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 75/2 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం 52 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌కు మూడో రోజు ఆట అత్యంత కీలకం కానుంది. తొలి సెషన్‌లో ఇంగ్లండ్ పేసర్లను దీటుగా ఎదుర్కోవడంపైనే భారీ ఆధిక్యం ఆధారపడి ఉంటుంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేయగా కరుణ్ నాయర్ (57), సుందర్ (26) రాణించారు. అట్కిన్సన్‌కు 5, టంగ్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. క్రాలే (64), బ్రూక్ (53), డకెట్ (43) ఆకట్టుకున్నారు.
ఓపెనర్ల దంచుడు: భారత బ్యాటర్లు తడబడిన చోట ఇంగ్లండ్ ఓపెనర్లు క్రాలే, డకెట్ బ్యాట్లు ఝళిపించారు. ప్రతీ బౌలర్‌ను బాదేస్తూ ఈ సెషన్‌లో ఆడిన 16 ఓవర్లలోనే 109 పరుగులు సాధించారు. ఈ జోడీ ధాటికి పేసర్లు ఆకాశ్, సిరాజ్, ప్రసిద్ధ్ బౌండరీల రూపంలో ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ముఖ్యంగా డకెట్ టీ20 శైలిలో చెలరేగడంతో తొలి ఏడు ఓవర్లలోనే జట్టు 51 పరుగులతో నిలిచింది. చివరికి ఆకాశ్ ఓవర్‌లో రివర్స్ స్కూప్‌నకు యత్నించి కీపర్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ అప్పటికే తొలి వికెట్‌కు 77 బంతుల్లోనే 92 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత లంచ్‌కు ముందు క్రాలే ఓ ఫోర్‌తో 42 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు.
వికెట్ల వేట: రెండో సెషన్‌లో భారత పేసర్లు ఒక్కసారిగా జూలు విదిల్చారు. ముఖ్యంగా సిరాజ్, ప్రసిద్ధ్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేసి ఆరు వికెట్లను పడగొట్టారు. జోరు మీదున్న క్రాలేను ఆరంభంలోనే ప్రసిద్ధ్ దెబ్బతీశాడు. అనంతరం పోప్‌నకు రూట్ జత కలవడంతో ఇక బౌలర్లకు కష్టాలు తప్పవనిపించింది. కానీ కెప్టెన్ గిల్ బంతిని సిరాజ్‌కు ఇవ్వగా తను ఏకబిగిన ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేసి వికెట్ల వేట సాగించాడు. కట్టుదిట్టమైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈక్రమంలో ముందుగా అతడు పోప్ (22), రూట్ (29), బెథెల్ (6)లను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ 43వ ఓవర్‌లో స్మిత్ (8), ఒవర్టన్ (0)లను అవుట్ చేశాడు. ఈ దెబ్బకు టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 215/7 స్కోరుతో ఉంది. చివరి సెషన్‌లో అట్కిన్సన్ (11)ను ప్రసిద్ధ్ అవుట్ చేశాక వర్షంతో ఆట దాదాపు గంటపాటు ఆగింది. కాసేపటికే బ్రూక్‌ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ 23 రన్స్ ఆధిక్యంతో ఇన్నింగ్స్ ముగిసింది. గాయం కారణంగా వోక్స్ బ్యాటింగ్ చేయలేదు.
జైస్వాల్ దూకుడు: ప్రత్యర్థికి స్వల్ప ఆధిక్యమే దక్కేలా చేసిన జోష్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగింది. ఓపెనర్ జైస్వాల్ ఆది నుంచే వేగం చూపాడు. అటు డిఫెన్స్‌కు పరిమితమైన రాహుల్ (7)ను పదో ఓవర్‌లో టంగ్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అతడి ఓవర్‌లోనే జైస్వాల్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను డీప్ ఫైన్ లెగ్‌లో డాసన్ వదిలేశాడు. అయితే సుదర్శన్ (11)కు కూడా ఓసారి లైఫ్ లభించినా అట్కిన్సన్‌కు దొరికిపోయాడు. కాసేపటికి సరైన వెలుతురు లేకపోవడంతో 15 నిమిషాల ముందుగానే ఆటను ఆపేశారు.
1 టెస్టుల్లో భారత్‌పై ఎక్కువ (8) 50+ భాగస్వామ్యాలు నమోదు చేసిన ఓపెనింగ్ జోడీగా క్రాలే-డకెట్.
గ్రీనిడ్జ్-హేన్స్ (విండీ్‌స)తో సమంగా నిలిచారు.
2 స్వదేశంలో జరిగిన టెస్టుల్లో ఎక్కువ పరుగులు (ఇంగ్లండ్‌లో 7220) సాధించిన రెండో బ్యాటర్‌గా రూట్. పాంటింగ్ (ఆసీ్‌సలో 7578) ముందున్నాడు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి