BCCI Stance on Pakistan: ఐసీసీ గ్రూప్ దశలోనూ కష్టమే
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:32 AM
భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య బీసీసీఐ ఐసీసీ గ్రూప్ దశలో ఈ మ్యాచ్‌లు జరగవద్దని భావిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.పాక్ హాకీ జట్టు భారత్‌లో జరుగనున్న ఆసియాకప్ టోర్నీలో పాల్గొంటుందో లేదో అనుమానం వ్యక్తం అయ్యింది

భారత్ x పాక్ మ్యాచ్‌లపై ఊహాగానాలు
న్యూఢిల్లీ: చాలా ఏళ్లుగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీ్‌సలు జరగడం లేదు. తాజాగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇకముందు కూడా తలపడేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఐసీసీ వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్లో ఈ దాయాది జట్లను ఒకే గ్రూప్‌లో ఆడించడం పరిపాటి. టోర్నీలకు క్రేజ్ తెప్పించడంతోపాటు ఆర్థికంగాకూ అధిక ఆదాయం లభిస్తుందనే భావనలో ఐసీసీ ఇలాంటి షెడ్యూల్‌ను ఏర్పాటు చేస్తుంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇకముందు పాక్‌తో గ్రూప్ దశలోనూ తలపడవద్దని బోర్డు భావిస్తోందని, ఇప్పటికే ఐసీసీకి కూడా లేఖ రాసినట్టు కథనాలు వెలువడ్డాయి. బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ‘ప్రస్తుతానికైతే అలాంటి వార్తల్లో నిజం లేదు. భవిష్యత్ గురించి ఇప్పుడే చెప్పలేం’ అని బోర్డు అధికారి తేల్చాడు. పురుషుల విభాగంలో వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి మహిళల వరల్డ్‌కప్ జరుగనుంది. ఇందులో భారత్-పాక్ మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడిస్తారా? లేక రద్దు చేస్తారా? అనేది చూడాలి.
పాక్ హాకీ జట్టు పరిస్థితేంటి?
పాక్ జాతీయులకు వీసా నిలిపివేతతో భారత్‌లో జరిగే ఆసియాక్‌పలో ఆ దేశ హాకీ జట్టు ఆడేది సందేహం నెలకొంది. ఆగస్టు-సెప్టెంబరులో ఈ టోర్నీ జరుగుతుంది.