Share News

Mohammed Shami: రోజుకు ఒక్కసారే భోజనం, నో బిర్యానీ.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 9 కిలోలు తగ్గిన షమీ..

ABN , Publish Date - Feb 22 , 2025 | 04:13 PM

స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ దళానికి షమీ నాయకత్వం వహిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగానే రాణించాడు. ఐదు వికెట్లు దక్కించుని బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు.

Mohammed Shami: రోజుకు ఒక్కసారే భోజనం, నో బిర్యానీ.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 9 కిలోలు తగ్గిన షమీ..
Mohammed Shami losses 9 kgs

కొంతకాలంగా గాయాల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దిగ్గజ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం బలంగా సన్నద్ధమయ్యాడు. మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ దళానికి షమీ నాయకత్వం వహిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగానే రాణించాడు. ఐదు వికెట్లు దక్కించుని బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు. వన్డేల్లో బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు (Mohammed Shami losses 9 kgs).


దాదాపు 14 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన షమీ ఫిట్‌నెస్ కోసం అమితంగా శ్రమించాడట. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చెమటోడ్చాడట. కఠినమైన వ్యాయామం, డైటింగ్ చేసి ఏకంగా 9 కిలోల బరువు తగ్గాడట. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో షమీ వెల్లడించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతో చిన్న చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోలో షమీ తన ఆహారపు అలవాట్ల గురించి, గాయం నుంచి కోలుకునేందుకు చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడాడు.


``గాయం నుంచి కోలుకుని తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు చాలా శ్రమించా. నేను ఎన్‌సీఏకు వెళ్లేటపుడు దాదాపు 90 కిలోలు ఉన్నా. నేను స్వీట్లు పెద్దగా తినను. అలాగే రుచి కోసం ఎక్కువగా వెంపర్లాడను. కానీ, బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీకి దూరమవడం కొంత ఆందోళన కలిగించింది. నేను 2015 నుంచి టిఫిన్, లంచ్ మానేశాను. నేరుగా డిన్నర్ మాత్రమే చేస్తున్నా. మొదట్లో ఈ అలవాటు చాలా కష్టంగా అనిపించేది. ఆ తర్వాత అలవాటైపోయింద``ని షమీ వెల్లడించాడు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 22 , 2025 | 04:13 PM