Indian Pace Attack: భళా.. బుమ్రా
ABN , Publish Date - Jul 12 , 2025 | 02:30 AM
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో శుక్రవారం బౌలర్ల జోరు మధ్య ఆట ఆచితూచి అన్నట్టుగా సాగింది.

లార్డ్ప్‌లో తొలిసారి 5 వికెట్లు
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 387
రూట్ శతకం జూ భారత్ తొలి ఇన్నింగ్స్ 145/3
రాహుల్ అజేయ అర్ధసెంచరీ
రెండో టెస్టు
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో శుక్రవారం బౌలర్ల జోరు మధ్య ఆట ఆచితూచి అన్నట్టుగా సాగింది. స్టార్ పేసర్ బుమ్రా (5/74) ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో తొలిసారిగా ఐదు వికెట్లతో హానర్స్ లిస్ట్‌లో చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (53 బ్యాటింగ్) అజేయ అర్ధసెంచరీతో భారత్ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం గిల్ సేన 242 పరుగులు వెనుకబడి ఉండడంతో శనివారం ఏమేరకు నిలుస్తారనేది కీలకం కానుంది. అయితే అంతకుముందు బుమ్రా మిడిలార్డర్‌ను దెబ్బతీసినా.. బ్రైడన్ కార్స్ (56), జేమీ స్మిత్ (51) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో 387 పరుగులు చేసింది. రూట్ (104) శతకం పూర్తి చేయగా, స్టోక్స్ (44) ఫర్వాలేదనిపించాడు. సిరాజ్, నితీశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్‌ను కోల్పోయిన భారత్ 43 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. రాహుల్ (53 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో నిలువగా, కరుణ్ నాయర్ (40) సహకరించాడు.
ఆదుకున్న టెయిలెండర్లు: రెండో రోజు 251/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించగా.. ఉదయం సెషన్ ఆసక్తికరంగా సాగింది. తొలి బంతినే ఫోర్‌గా మలిచి రూట్ శతకం పూర్తి చేయగా.. పేసర్ బుమ్రా తన పదునైన బంతులతో ఏకంగా మూడు వికెట్లతో చెలరేగాడు. అయితే జేమీ స్మిత్ వన్డే తరహాలో చెలరేగి ఆదుకున్నాడు. ఆరంభ మూడో ఓవర్‌లోనే కెప్టెన్ స్టోక్స్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు. అయితే ఆ వెంటనే సిరాజ్ ఓవర్‌లో స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ వదిలేశాడు. అప్పటికి అతడి స్కోరు 5 రన్స్ మాత్రమే. మరోవైపు బుమ్రా మాత్రం తర్వాతి ఓవర్‌లోనే రూట్, వోక్స్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో ఒక్కసారిగా ఇంగ్లండ్ 271/7 స్కోరుతో షాక్‌కు గురైంది. బుమ్రా జోరుకు ఈ సెషన్‌లోపే జట్టు ఆలౌటవుతుందనిపించింది.
బంతి మారింది..లయ తప్పింది: సెషన్ ఆరో ఓవర్‌లో బంతి మార్పు కోసం భారత్ ఫిర్యాదు చేసింది. అప్పటికి కేవలం పది ఓవర్లు మాత్రమే ఆ బంతిని వాడడం గమనార్హం. అయితే అంపైర్లు మార్చిన బంతిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తను అంపైర్‌తో వాగ్వాదానికి దిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ‘ఇది పది ఓవర్ల బంతేనా?’ అంటూ సిరాజ్ ఆశ్చర్యపోవడం మైక్‌లో వినిపించింది. ఇన్నింగ్స్ 91వ ఓవర్ మధ్యలో ఈ మార్పు జరగ్గా.. స్మిత్ అదే ఓవర్‌లో ఫోర్‌తో తన బ్యాట్‌కు పనిచెప్పాడు. బంతి స్వింగ్ కాకపోవడంతో స్మిత్-కార్స్ జోడీ అడపాదడపా ఫోర్లతో పాటు చకచకా సింగిల్స్‌తో స్కోరును 300 దాటించారు. అయితే కేవలం 48 డెలివరీల తర్వాత 99వ ఓవర్‌లో బంతిని మరోసారి మార్చాల్సి వచ్చింది. అయినా బౌలర్లు ప్రభావం చూపలేదు. కార్స్ ఫోర్లతో వేగం పెంచాడు. అటు స్మిత్ 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే విరామం తర్వాత రెండో ఓవర్‌లోనే స్మిత్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. అటు ఆర్చర్ (4)ను బుమ్రా బౌల్డ్ చేసి లార్డ్స్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. ఇక సిరాజ్ ఓవర్‌లో సిక్సర్‌తో కార్స్ ఫిఫ్టీ పూర్తి చేయగా.. అతడి క్యాచ్‌లను ఆకాశ్, జురెల్ వదిలేయడం గమనార్హం. అయితే తర్వాతి ఓవర్‌లోనే సిరాజ్ అతడి వికెట్‌తో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. మొత్తంగా చివరి మూడు వికెట్ల మధ్యే 116 రన్స్ రావడం విశేషం.
రాహుల్ హాఫ్ సెంచరీ: రెండో సెషన్‌లో 14 ఓవర్లు ఆడిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ సమయానికి 44 పరుగులు చేసి జైస్వాల్ (13) వికెట్‌ను కోల్పోయింది. ఆర్చర్ తన తొలి ఓవర్‌లోనే అతడి వికెట్ తీశాడు. ఆ తర్వాత కూడా ఈ పేసర్ నిలకడగా 145కి.మీ వేగంతో బంతులు విసిరి ఇబ్బందిపెట్టాడు. కరుణ్, రాహుల్ మాత్రం వికెట్ కోల్పోకుండా ఆఖరి సెషన్‌కు వెళ్లారు. అయితే ఓపిగ్గా ఆడుతున్న కరుణ్‌ను చివరి సెషన్‌లో స్టోక్స్ అవుట్ చేశాడు. రెండో వికెట్‌కు వీరి మధ్య 61 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత భీకర ఫామ్‌లో ఉన్న గిల్ (16)ను పేసర్ వోక్స్ అవుట్ చేయడంతో భారత్ 107 రన్స్‌కు 3 వికెట్లు కోల్పోయింది. అయితే పట్టుదలగా ఆడిన రాహుల్ మాత్రం అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అతడికి పంత్ (19 బ్యాటింగ్) సహకరించడంతో రెండో రోజును భారత్ ముగించింది.
1 విదేశీ గడ్డపై ఎక్కువ సార్లు (13) ఐదు వికెట్ల ఫీట్‌ను అందుకున్న భారత బౌలర్‌గా బుమ్రా. కపిల్ (12)ను అధిగమించాడు. అయితే తన కెరీర్‌లో ఇది 15వది. అలాగే సేనా జట్లపై అత్యధికంగా 11 సార్లు ఈ ఫీట్‌ను నమోదు చేసిన ఆసియా బౌలర్‌గా అక్రమ్ సరసన నిలిచాడు.
టెస్టుల్లో అధిక క్యాచ్ (211)లు తీసుకున్న ఫీల్డర్‌గా జో రూట్. ద్రవిడ్ (210)ను అధిగమించాడు.
టెస్టుల్లో తక్కువ బంతుల్లోనే (1303) వెయ్యి రన్స్ పూర్తి చేసిన వికెట్‌కీపర్‌గా జేమీ స్మిత్.
2 ఇంగ్లండ్‌లో ఎక్కువ వికెట్లు (47) తీసిన రెండో భారత బౌలర్‌గా బుమ్రా. ఇషాంత్ (48) టాప్‌లో ఉన్నాడు.
3 లార్డ్స్‌లో హ్యాట్రిక్ శతకాలు పూర్తి చేసిన మూడో బ్యాటర్‌గా జో రూట్. గతంలో జాక్ హాబ్స్, మైకేల్ వాన్ ఉన్నారు.