Asia Cup Trophy Controversy: పీసీబీ చీఫ్ కుతంత్రాలు.. ఇప్పటికీ టీమిండియా చేతికి దక్కని ఆసియా కప్ ట్రోఫీ
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:17 PM
ఆసియా కప్ గెలిచినా కూడా ట్రోఫీ భారత్ చేతికి దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది. వచ్చే నెలలో ఏసీసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు భారత్, పాక్, ఇతర సభ్య దేశాలు హాజరుకానున్నాయి. కానీ ఈ మీటింగ్‌కు పీసీబీ చీఫ్ ముఖం చాటేస్తే ప్రతిష్టంభన మరింత కాలం పాటు కొనసాగొచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్‌కు ఇప్పటికీ ట్రోఫీ దక్కలేదు. మ్యాచ్ అనంతరం పీసీబీ చీఫ్, పాక్ మంత్రి మొహ్‌సీన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని టీమిండియా అందుకోవాల్సి ఉండగా ఇందుకు బీసీసీఐ తిరస్కరించింది. దీంతో, ఉక్కురోషం పట్టలేకపోయిన నఖ్వీ ట్రోఫీని (Mohsin Naqvi) తన వెంట తీసుకెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే, ట్రోఫీ ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంది (Asia Cup trophy Controversy).
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా అయిన నఖ్వీ ఈ ట్రోఫీని దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోగల లాకర్‌లో పెట్టారు. తను చెప్పే వరకూ ట్రోఫీని ఎవరికీ ఇవ్వొద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి మరీ వెళ్లారు. ఈ విషయంపై భారత్ (BCCI) పలు వేదికల్లో ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇక సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ వార్షిక సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చింది. కానీ విషయం ఓకొలక్కి రాకపోవడంతో నవంబర్‌లో జరగనున్న సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ఏసీసీ నిర్ణయించింది. సభ్య దేశాలైన భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్ ఈ సమావేశంలో పాల్గొంటాయి. ఇక నవంబర్ 4-9 తేదీల్లో జరగనున్న ఐసీసీ త్రైమాసిక సమావేశాల నేపథ్యంలో ఈ మిటింగ్ కూడా నిర్వహించనున్నారు. కానీ, ఈ మీటింగ్‌కు నఖ్వీ హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు నఖ్వీ హాజరు కాకపోవచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. గతంలో ఐసీసీ వార్షిక సమావేశాలకు నఖ్వీ గైర్హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
నఖ్వీ తన స్థానంలో అధికారిక ప్రతినిధిని పంపించే అవకాశం ఉందని ఏసీసీ సభ్యులు చెబుతున్నారు. ఇదే జరిగితే, ప్రతిష్టంభన మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. తన చేతుల మీదుగా టీమిండియా ట్రోఫీ అందుకోవాలని నఖ్వీ పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ చిక్కుముడి ఇలాగే సుదీర్ఘకాలం పాటు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. నఖ్వీ చర్యల కారణంగా క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని సమస్య ఉత్పన్నమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై బీసీసీఐ వర్గాలు కూడా స్పందించాయి. ఏసీసీ మీటింగ్ జరిగే సమయానికి ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెెలిపాయి.
ఇవి కూడా చదవండి
ఇలా అనడం సిగ్గు చేటు.. మాజీ క్రికెటర్‌పై మండిపడ్డ గౌతమ్ గంభీర్
Vaibhav Suryavanshi: వైభవ్ మరో చరిత్ర
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి