Share News

Borivali ticketless passenger: టిక్కెట్ లేని రైల్వే ప్రయాణికుడి రచ్చ.. స్టేషన్‌లో కంప్యూటర్‌ల ధ్వంసం

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:59 PM

టిక్కెట్‌ లేకుండా ప్రయాణించి రైల్వే సిబ్బందికి దొరికిపోయిన ఓ ప్రయాణికుడు ఆ తరువాత మరింతగా రెచ్చిపోయాడు. రైల్వే స్టేషన్‌లోని కంప్యూటర్‌లను ధ్వంసం చేశాడు. ముంబైలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఉదంతం తాలూకు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Borivali ticketless passenger: టిక్కెట్ లేని రైల్వే ప్రయాణికుడి రచ్చ.. స్టేషన్‌లో కంప్యూటర్‌ల ధ్వంసం
Borivali Station Ticketless Passenger

ఇంటర్నెట్ డెస్క్: టిక్కెట్ లేకుండా రైల్లో ప్రయాణించింది చాలక స్టేషన్‌లో రచ్చరచ్చ చేసిన ఓ ప్రయాణికుడి ఉదంతం ముంబైలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను చూసి జనాలు షాకయిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకే భద్రత లేకపోతే జన జీవనం స్తంభించిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలోని బోరీవాలీ స్టేషన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆగస్టు 2న కొందరు ప్రయాణికులు విరార్ ఫాస్ట్ లోకల్ రైల్లో సరైన టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ చిక్కారు. సెకెండ్ క్లాస్ టిక్కెట్‌తో ఫస్ట్ క్లాస్ కోచ్‌లో ప్రయాణించి అడ్డంగా బుక్కయిపోయారు. వీరిలో ఒక వ్యక్తి అంధేరీ, బోరీవాలీ స్టేషన్‌ల మధ్య ఎలాంటి టిక్కెట్ లేకుండా జర్నీ చేశాడు. ప్రోటోకాలం ప్రకారం, వారిని బోరీవాలీ స్టేషన్‌లో దింపి టీటీఈ ఆఫీసుకు తరలించారు. ఆ తరువాత వారిలో ఓ ప్రయాణికుడు ఉన్మాదిలా రెచ్చిపోయాడు.


ఈ తనిఖీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అతడు రైల్వే సిబ్బందిపై దాడి చేయడంతో పాటు కార్యాలయంలోని కంప్యూటర్లు, మానిటర్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో రైల్వే సిబ్బందితో పాటు డిప్యుటీ చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ షంషేర్ ఇబ్రహీమ్ కూడా గాయపడ్డారు. నిందితుడు కూడా గాయపడ్డాడు. అతడి ఒంటిపై రక్తం వీడియోలో కనిపించింది.

పసుపు పచ్చ కుర్తా ధరించిన ఆ ప్రయాణికుడు రైల్వే సిబ్బందిపై పెద్ద పెట్టున అరవడం వీడియోలో రికార్డయ్యింది. అక్కడున్న వస్తువులను కూడా అతడు అటూ ఇటూ విసిరేశాడు. నిందితుడి వెంట వచ్చిన మహిళ ఆ రచ్చకు హడలిపోయింది. భయంతో కుర్చీలో కూలబడిపోయింది. చేతుల్లో ముఖం దాచుకుని దుఃఖిస్తున్నట్టు కనిపించింది. పచ్చ కుర్తా వ్యక్తి ఆమెను ఊరడిస్తూనే సిబ్బందిపై అరుస్తూ రణరంగం సృష్టించాడు. ‘ధరావీలో నా పేరు అందరికీ తెలుసు. నాతో పెట్టుకోకు. మీ అందరిపై ఫిర్యాదు చేస్తా’ అని బెదిరింపులకు దిగాడు. తనతో పాటు ఉన్న తోటి ప్రయాణికుడిని ఈ దృశ్యాలను వీడియో తీయాలని పురమాయించాడు.


ఈలోపు, వారిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు నిలువరించి ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని రైల్వే పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ పెద్ద చర్చకు తెరతీసింది.


ఇవీ చదవండి:

కొలీగ్‌కు లవర్‌ను వెతికిపెడితే బోనస్.. అమెరికా టెక్ కంపెనీ ఆఫర్

10 ఏళ్ల బాలుడిని ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టేసిన తల్లిదండ్రులు

Read Latest and Viral News

Updated Date - Aug 03 , 2025 | 01:13 PM