Woman Wakes Up In Coffin: మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు.. ఠక్కున పైకి లేచిన వృద్ధురాలు..
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:44 PM
ఓ వృద్ధురాలు అంత్యక్రియలకు కొద్దిసేపు ముందు కళ్లు తెరిచింది. శవ పేటికలో అటు, ఇటు కదలసాగింది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
థాయ్‌లాండ్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిందనుకున్న ఓ వృద్ధురాలు అంత్యక్రియలకు కొద్దిసేపు ముందు పైకి లేచింది. అంత్యక్రియలకు హాజరైన వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌కు చెందిన 65 ఏళ్ల ఓ వృద్ధురాలు అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరింది. పరిస్థితి విషమించటంతో ఆదివారం చనిపోయింది. ఈ మేరకు డాక్టర్లు కూడా ఆమె చనిపోయిందని అధికారికంగా ధ్రువీకరించారు.
కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వృద్ధురాలి శవాన్ని పేటికలో పెట్టి శ్మశానానికి తీసుకెళ్లారు. నాంతబురిలోని వాట్ రాట్ ప్రకాంగ్‌తమ్ గుడి దగ్గర అంత్యక్రియలు జరుగుతున్నాయి. అక్కడి ఆచారం ప్రకారం అంత్యక్రియల్ని లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శవ పేటిక కదలటం కొంతమంది గుర్తించారు. వెంటనే శవ పేటికను తెరిచారు. అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచేలా ఆ వృద్ధురాలు ప్రాణాలతో ఉంది.
అటు, ఇటు కదులుతూ ఉంది. కుటుంబసభ్యులు మొదట ఆశ్చర్యపోయినా.. తర్వాత సంతోషించారు. వెంటనే ఆమెను అక్కడినుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి’..‘ఇంకా నయం బతికుండగానే ఆమెను పూడ్చి పెట్టలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వామ్మో.. అచ్చం అలాగే.. ఫేక్ ఆధార్, పాన్ కార్డులను తయారు చేస్తున్న ఏఐ..
బిహార్‌ను టచ్ చేస్తే దేశాన్ని కుదిపేస్తాం.. ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీలో సీఎం