B Saroja Devi: సీనియర్ నటి బీ సరోజా దేవి కన్నుమూత
ABN , Publish Date - Jul 14 , 2025 | 10:06 AM
Senior Actress B Saroja Devi: ప్రముఖ సీనియర్ నటి బీ సరోజా దేవి కన్నుమూశారు. గత కొంతకాలంగావృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ప్రముఖ సీనియర్ నటి బీ సరోజా దేవి కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగావృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరు, యశవంతపురలోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే 87 ఏళ్ల వయసులో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.
70 ఏళ్ల సినీ ప్రయాణం..
సరోజా దేవీ 1938 జనవరి 7వ తేదీన బెంగళూరులో జన్మించారు. 13 ఏళ్లకే ఆమెకు సినిమా ఆఫర్ వచ్చింది. అయితే, ఆ ఆఫర్‌ను ఆమె కాదన్నారు. కొన్నేళ్ల తర్వాత 1955లో విడుదలైన ‘మహాకవి కాళిదాసు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోటే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. రెండేళ్ల తర్వాత ‘1957’లో ‘పాండురంగ మహాత్యం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు.
మాతృభాష కన్నడతో పాటు తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. 70 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 200 సినిమాల్లో నటించారు.
భర్త మరణంతో డిప్రెషన్‌లోకి..
1985లో ఆమె లేడీస్ హాస్టల్ అనే సినిమా కోసం షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యారు. మరుసటి సంవత్సరం 1986లో ఆయన చనిపోయారు. భర్త మరణం తర్వాత ఆమె సినిమా షూటింగ్‌లో పాల్గొనలేదు. ఓ సంవత్సరం పాటు కుటుంబసభ్యుల్ని తప్ప వేరే వాళ్లను కలవను కూడా లేదు.
1987లో మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. లేడీస్ హాస్టల్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. భర్త మరణం తర్వాత ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. భర్త మరణానికి ముందు సైన్ చేసిన సినిమాలు పూర్తి చేశారు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే, నిర్మాతలు, ఫ్యాన్స్ బలవంతం చేయటంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. 2019లో ‘నటసార్వభౌమ’ అనే కన్నడ సినిమాలో చివరగా నటించారు.
ఇవి కూడా చదవండి
నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణ
అక్కా.. ల్యాప్‌టాప్‌ను ఇలా కూడా వాడొచ్చా.. ఈమె తెలివితేటలు చూస్తే..