Himachal Pradesh Polyandry: ఒకే మహిళను పెళ్లాడిన అన్నదమ్ములు.. ఇది చట్టబద్ధమేనా
ABN , Publish Date - Jul 20 , 2025 | 10:26 PM
ఒకే మహిళను పెళ్లాడిన ఇద్దరు అన్నదమ్ముల ఉదంతం ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఈ వివాహం చట్టబద్ధతపై స్థానిక లాయర్లు పలు వివరాలు వెల్లడించారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల హట్టీ తెగకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకే మహిళను వివాహమాడిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్నే తాము పాటించామని సదరు అన్నదమ్ములు తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు భారతీయ చట్టాలు బహుభర్తృత్వాన్ని అనుమతిస్తాయా అని పలువురు సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అక్కడి లాయర్లు పలు కీలక విషయాలను వెల్లడించారు.
హట్టీ తెగలో కనిపించే ఈ తరహా వివాహాన్ని జోడీదారా లేదా జజ్దా అని పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని రెవెన్యూ చట్టాల్లో ఈ తరహా వివాహానికి గుర్తింపు ఉంది. హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని ట్రాన్స్-గిరీ ప్రాంతంలో ఉండే ఈ తెగకు మూడేళ్ల క్రితం షెడ్యూల్డ్ తెగగా గుర్తింపు దక్కింది.
తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. వారసుల మధ్య పంపకాల్లో వ్యవసాయ భూమి చీలికలు కాకుండా ఈ సంప్రదాయం ఉనికిలోకి వచ్చిందని తెలిపారు. ఉమ్మడి కుటుంబాల్లో సోదరుల మధ్య ఐకమత్యం కూడా పెరుగుతుందని తెలిపారు. పర్వత ప్రాంతాల్లో కుటుంబాలు బలంగా ఉండటం వాటి ఉనికికి కీలకమని తెలిపారు. సుదూర ప్రాంతాల్లో వ్యవసాయం చేయడం, ఆర్థిక అవసరాలు వంటివి ఈ సంప్రదాయానికి పురుడు పోశాయని అన్నారు.
హట్టీ తెగలో వివాహాలు కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ పరిధిలోకే వస్తాయని అక్కడి లాయర్లు చెబుతున్నారు. అయితే, గిరిజనుల సంప్రదాయాల పరిరక్షణకు చట్టాల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయని వివరించారు. జోడీదారా చట్టం ప్రకారం ఈ వివాహాలను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు గుర్తించిందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఇలాంటి వివాహాలు బాగా తగ్గిపోయాయనేది అనేక మంది చెప్పే మాట. పెరుగుతున్న అక్షరాస్యత, యువత ఉద్యోగాల పేరిట నగరాలకు వలస పోవడం, మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితుల కారణంగా అనేక మంది ఇలాంటి వివాహాలకు దూరం జరుగుతున్నారు. అడపాదడపా జరిగే వివాహాలు గురించి కూడా బయట ఎవరికీ తెలియట్లేదని చెబుతున్నారు. కాలక్రమంలో ఈ తరహా వివాహం కనుమరుగవుతుందని కూడా కొందరు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి:
క్యాన్సర్‌తో మరణం అంచున యువతి.. మిగిలిన టైంలో ఏం చేయాలో చెప్పాలంటూ పోస్టు
లండన్‌లోని ఇస్కాన్ రెస్టారెంట్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్