Parents Leave Child: 10 ఏళ్ల బాలుడిని ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టేసిన తల్లిదండ్రులు
ABN , Publish Date - Aug 03 , 2025 | 08:27 AM
పాస్‌పోర్టులేని ఓ పదేళ్ల చిన్నారిని అతడి తల్లిదండ్రులు ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టి విహారయాత్రకు వెళ్లిపోయిన షాకింగ్ ఉదంతం స్పెయిన్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట కలకలం రేపుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: పదేళ్ల బాలుడిని అతడి తల్లిదండ్రులు ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టి విహారయాత్రకు వెళ్లిపోయారంటూ స్పెయిన్‌లోని ఎయిర్‌పోర్టు సిబ్బంది ఒకరు నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టు ఆపరేషన్స్‌ను పర్యవేక్షించే ఓ మహిళ టిక్‌టాక్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది.
లిలియన్ అనే మహిళ ఈ విషయాన్ని తెలిపారు. బాలుడి పాస్‌పోర్టు కాలపరిమితి ముగియడంతో తల్లిదండ్రులు అతడిని ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టి తాము విమానం ఎక్కేశారని అన్నారు. ఒంటరిగా ఉన్న బాలుడిని గుర్తించిన సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు.
‘ఆ పిల్లాడికి పాస్‌పోర్టు ఎక్స్‌పైర్ అయ్యిందట. అతడికి వీసా కూడా లేదట. అందుకని తల్లిదండ్రులు అతడిని ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టేశారు. చిన్నారిని వచ్చి తీసుకెళ్లమని తమ బంధువు ఒకరికి చెప్పి వెళ్లిపోయారట. ఇదంతా చాలా తేడాగా అనిపించింది. ఏ తల్లిదండ్రులైనా ఇలా చేయగలరా. డాక్యుమెంట్స్ లేవని ఎయిర్‌పోర్టులో బిడ్డను వదిలేస్తారా? బిడ్డను వచ్చి తీసుకెళ్లమని బంధువుకు చెప్పారట. వాళ్లు వచ్చేటప్పటికి గంట పట్టొచ్చు లేదా మూడు గంటలు పట్టొచ్చు.. పిల్లాడు ఎయిర్‌పోర్టులో ఒంటరిగా ఉండిపోతాడు. ఇది తెలిసీ ఆ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఎలా వెళ్లగలిగారు’ అని ఆమె ప్రశ్నించింది.
మీడియా కథనాల ప్రకారం, ఎయిర్‌పోర్టు అధికారులు ఆ తల్లిదండ్రులు ప్రయాణిస్తున్న విమాన పైలట్ గురించి జరిగిన విషయం గురించి చెప్పారు. దీంతో, ఆ పైలట్ ప్రయాణికులకు ఈ విషయం చెప్పారు. ‘ఎయిర్‌పోర్టులో బిడ్డను వదిలిపెట్టి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా’ అని పలుమార్లు అడిగినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అయితే, పోలీసులు ఎట్టకేలకు ఆ తల్లిదండ్రుల జాడ గుర్తించారు. మరో చిన్నారితో ప్రయాణిస్తున్న వారిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఇవీ చదవండి:
వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..
తన సీటులో మహిళ కూర్చుందని.. రెచ్చిపోయి అందరి ముందూ..