CPR Revives Electrocuted Snake: నువ్వు దేవుడివి సామీ.. కరెంట్ షాక్ కొట్టిన పాముకు నోటితో..
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:13 PM
కరెంట్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాముకు స్నేక్ రెస్క్యూయర్ సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. ఇందుకోసం ఏకంగా అరగంట పాటు ఎంతో కష్టపడ్డాడు. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.
కరెంట్ షాక్ కారణంగా చావు బతుకుల మధ్య పడ్డ పాముకు ఓ స్నేక్ రెస్క్యూయర్ సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. అది కూడా పాము తలను నోట్లో పెట్టుకుని మరీ సీపీఆర్ ఇచ్చి దాని ప్రాణాలు రక్షించాడు. ఇందుకోసం ఏకంగా అరగంట పైనే చాలా కష్టపడ్డాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వల్సద్‌లో ఓ పాము ఆహారం కోసం వెతుకుతూ త్రీ ఫేజ్ కరెంట్ తీగలపైకి ఎక్కింది. కరెంట్ షాక్ తగలటంతో 15 అడుగుల ఎత్తులోనుంచి నేలపై పడిపోయింది. దీంతో అది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
కదలికలు లేకుండా నేలపై అచేతనంగా పడిపోయింది. దాన్ని చూసిన గ్రామస్తులు స్నేక్ రెస్క్యూయర్ ముకేష్ వాయద్‌కు సమాచారం ఇచ్చారు. ముకేష్‌కు పాముల్ని కాపాడటంలో పదేళ్ల అనుభవం ఉంది. అతడు అక్కడికి రాగానే పాము పరిస్థితి ఏంటో గుర్తించాడు. వెంటనే సీపీఆర్ చేయటం మొదలెట్టాడు. పాము తలను నోట్లో పెట్టుకుని మరీ దానికి ఊపిరి ఊదాడు. దాన్ని రక్షించటం కోసం 30 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించాడు. చివరకు పాములో కదలికలు వచ్చాయి. కొద్ది సేపటి తర్వాత అటు, ఇటు తిరగసాగింది. ముకేష్ దాన్ని ఊరికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు.
ముకేష్ ఊపిరి ఊది ప్రాణం పోసిన ఆ పాము విషపూరితమైనది కాదు. అది ర్యాట్ స్నేక్. తెలుగులో జెర్రిపోతు అంటారు. ఈ పాములు ఎలుకల్ని తిని జీవిస్తుంటాయి. ఇండియా, సౌత్ ఆసియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆకారంలో ఇవి చాలా పెద్దగా ఉంటాయి. వేగంగా ముందుకు కదులుతాయి. చాలా మంది వీటిని చూసి నాగుపాములు అనుకుంటూ ఉంటారు. వీటి వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు. పైగా పంటల్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని చూసిన వారు చంపకుండా అలానే వదిలేస్తూ ఉంటారు.
ఇవి కూడా చదవండి
ఐ బొమ్మ రవి కేసు.. బెయిల్ వస్తుందా?
ఐదేళ్ల పాటు కటింగ్ ఫ్రీగా చేస్తా.. అభ్యర్థి భర్త వినూత్న ప్రచారం..