Share News

Elon Musk: నా పార్టనర్ భారత మూలాలున్న వ్యక్తి, నా కొడుకు పేరు శేఖర్: ఎలాన్ మస్క్

ABN , Publish Date - Dec 01 , 2025 | 07:33 AM

జెరోధా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఎలాన్ మస్క్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కొడుకు పేరు శేఖర్ అని తెలిపారు.

Elon Musk: నా పార్టనర్ భారత మూలాలున్న వ్యక్తి, నా కొడుకు పేరు శేఖర్: ఎలాన్ మస్క్
Elon Musk-Shivon Zillis

ఇంటర్నెట్ డెస్క్: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి, టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జెరోధా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న మస్క్ అనేక అంశాలపై తన మనసులో మాటను పంచుకున్నారు (Elon Musk On His Partners Indian Heritage).

న్యూరాలింక్ సంస్థ ఉన్నతాధికారి శివోన్ జిలిస్‌తో ప్రస్తుతం ఎలాన్ మస్క్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ జంటకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, శివోన్ జిలిస్ భారత మూలాలు ఉన్న వ్యక్తి అని మస్క్ నిఖిల్ కామత్‌కు చెప్పారు. ‘మీకు ఇది తెలుసో లేదో కానీ నా పార్టనర్ జిలిస్‌కు భారత మూలాలు ఉన్నాయి. మా తనయుడి పేరు (మిడిల్ నేమ్) శేఖర్. భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన గౌరవార్థం నా కుమారుడి పేరులో శేఖర్ అనే పదాన్ని చేర్చాను’ అని తెలిపారు.

ఇక శివోన్ జిలిస్‌ చిన్నతనం కెనడాలోనే గడిచిందని మస్క్ తెలిపారు. ఆమె తండ్రి అంతర్జాతీయ ఎక్సేంజ్ స్టూడెంట్ అని తెలిపారు. చిన్నతనంలో ఆమెను దత్తత తీసుకున్నారని చెప్పారు. అయితే, ఆమె నేపథ్యం గురించి తనకు పూర్తి వివరాలు తెలియవని అన్నారు.


ఎవరీ శివోన్ జిలిస్

టెక్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శివోన్ జిలిస్.. ప్రస్తుతం న్యూరాలింక్‌‌లో ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్‌ విభాగానికి డైరెక్టర్‌గా ఉన్నారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం, ఆమె బాల్యం కెనడాలోని ఒంటారియోలో గడిచింది. యేల్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం, ఫిలాసఫీలో పట్టభద్రులయ్యారు. మొదట్లో ఆమె ఐబీఎమ్, బ్లూమ్‌బర్గ్ సంస్థల్లో పనిచేశారు. 2016లో ఏఐ వైపు దృష్టి మళ్లించిన ఆమె ఓపెన్ ఏఐ సంస్థలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎదిగారు. బోర్డులో అత్యంత పిన్నవయసు గల సభ్యురాలిగా గుర్తింపు పొందారు. అయితే, 2023లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2021లో మస్క్, జిలిస్‌‌కు స్ట్రైడర్, అజూర్ అనే కవలలు జన్మించారు. ఆ తరువాత 2024లో కూతురు ఆర్కేడియా పుట్టింది.

ఇదిలా ఉంటే, అమెరికాలోని భారతీయ నిపుణులపై కూడా మస్క్ ప్రశంసలు కురిపించారు. వారి వల్ల అమెరికాకు ఎంతో ప్రయోజనం కలిగిందని అన్నారు. అయితే, హెచ్-1బీ వీసా వ్యవస్థను కొందరు దుర్వినియోగం చేశారని కూడా చెప్పారు.


ఇవీ చదవండి:

అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు.. హెచ్-1బీ వీసాదారుడి కామెంట్

గూగుల్ నానో బనానా ప్రో సామర్థ్యం చూస్తే మతిపోవాల్సిందే..

Read Latest and Viral News

Updated Date - Dec 01 , 2025 | 08:19 PM