Share News

Princess Itka Klet: పోయిన 22 లక్షల రింగ్ తెచ్చిచ్చారు..5 లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:48 PM

Czech Republic Princess: డాక్టర్ టాటా దగ్గర చికిత్స తీసుకుంటోంది. చికిత్స బ్రేక్ సమయంలో ఇట్కా పాతాల్‌కోట్‌లోని తమియా అందాలు ఆస్వాదించడానికి వెళ్లింది. అక్కడి చోటా మహదేవ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తుండగా అనుకోని సంఘటన జరిగింది.

Princess Itka Klet: పోయిన 22 లక్షల రింగ్ తెచ్చిచ్చారు..5 లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు
Czech Republic Princess

ఇండియాకు వచ్చిన ఓ విదేశీ యువరాణి.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 లక్షల రూపాయలు విలువ చేసే తన ఉంగరాన్ని నీటిలో పోగొట్టుకుంది. అది తన ఎంగేజ్‌మెంట్ రింగు కావటంతో ఆమె దాని కోసం ఎంతో వెతికింది. అయినా అది దొరకలేదు. ఆశలు వదులుకుని బాధతో అక్కడినుంచి వెళ్లిపోయింది. అయితే, ఓ వ్యక్తి కొంతమంది గిరిజన యువకుల్ని వెంట బెట్టుకుని రింగు కోసం వెతికాడు. 48 గంటలు కష్టపడ్డ తర్వాత ఆ ఉంగరం దొరికింది. దాన్ని తీసుకుపోయి ఆ యువరాణికి ఇచ్చాడు. రింగు వెతికి తెచ్చినందుకు ఎంతో సంతోషించిన ఆమె వారికి 5 లక్షలు ఇస్తానంది. వాళ్లు మాత్రం ఆ ఐదు లక్షలు వద్దనేశారు. యువరాణి మనసు గెలుచుకున్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

చెక్ రిపబ్లిక్ యువరాణి ఇట్కా లెట్ గత కొన్ని నెలల నుంచి వెన్ను నొప్పితో బాధపడుతోంది. ఇండియాలో ఆయుర్వేద పద్దతుల ద్వారా నొప్పి నయం అవుతుందని ఆమెకు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా ఆయుర్వేద డాక్టర్ టాటా గురించి తెలుసుకుంది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు వచ్చింది. డాక్టర్ టాటా దగ్గర చికిత్స తీసుకుంటోంది. చికిత్స బ్రేక్ సమయంలో ఇట్కా పాతాల్‌కోట్‌లోని తమియా అందాలు ఆస్వాదించడానికి వెళ్లింది. అక్కడి చోటా మహదేవ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తుండగా అనుకోని సంఘటన జరిగింది.


ఆమె ఎంగేజ్‌మెంట్ రింగ్ ఆ నీళ్లలో పడి కొట్టుకుపోయింది. అక్కడి టూరిస్టుల సాయంతో యువరాణి దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించింది. అయితే, అది దొరకలేదు. ఎంతో బాధతో ఆమె చింద్వారా వచ్చేసింది. యువరాణి రింగు పోయిందని తెలుసుకున్న స్థానిక వ్యాపారి మనోజ్ విశ్వకర్మ రంగంలోకి దిగాడు. దాదాపు 12 మందికి పైగా గిరిజన యువకుల్ని వెంటబెట్టుకుని జలపాతం దగ్గరకు వెళ్లాడు. ఆ గుంపు మొత్తం రెండు రోజుల పాటు చాలా కష్టపడి ఆ రింగు కోసం వెతికింది. వాళ్ల కృషితోపాటు అదృష్టం తోడై రింగు దొరికింది. ఇసుక లోపల చిక్కుకున్న రింగును బయటకు తీశారు. దాన్ని యువరాణి దగ్గరకు తీసుకెళ్లి ఇచ్చారు.


దీంతో ఆమె ఎంతో సంతోషించింది. వారందిరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్దమైంది. అయితే, వారు ఆ డబ్బును వద్దన్నారు. తమ రెండు రోజుల కష్టానికి గానూ.. 41 వేల రూపాయలు ఇప్పిస్తే సరిపోతుంది అన్నారు. ఆ మొత్తం మాత్రమే తీసుకున్నారు. వారి మంచి తనానికి యువరాణి సంతోషించింది. డబ్బు ఇవ్వటంతో పాటు .. మనోజ్ విశ్వకర్మకు సన్మానం కూడా చేసింది.


ఇవి కూడా చదవండి

CM Chandrababu: కానిస్టేబుల్ టు ఐపీఎస్.. ఉదయ కృష్ణారెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

Battle of Karregutta Hills: చరిత్రలో అతి పెద్ద ఆపరేషన్.. 1000 మంది మావోయిస్టుల కోసం 24 వేల మంది జవాన్స్..

Updated Date - Apr 29 , 2025 | 05:55 PM