Brahmanandam Clarifies: మాజీ మంత్రి ఎర్రబెల్లి వీడియోపై స్పందించిన బ్రహ్మానందం..
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:27 PM
మాజీ మంత్రి ఎర్రబెల్లితో ఫొటో దిగడానికి నో చెప్పారంటూ జరుగుతున్న ప్రచారంపై బ్రహ్మానందం స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉందని, ఆ స్నేహంతోటే సరదాగా తోసేసినట్లు చెప్పారు.
సీనియర్ నటుడు మోహన్ బాబు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న (శనివారం) హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది పాల్గొన్నారు. వారిలో బ్రహ్మానందం, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా ఉన్నారు. కార్యక్రమం సందర్భంగా ఎర్రబెల్లి, బ్రహ్మానందాన్ని ఫొటో దిగుదామని అడిగారు. బ్రహ్మానందం ఇందుకు సరదాగా నో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎర్రబెల్లితో ఫొటోకు బ్రహ్మానందం నో చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై బ్రహ్మానందం స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘ఉదయాన్నే ఓ వీడియో చూసి నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్‌కు వెళ్లాను. బాగా రాత్రి అయిందని హడావుడిగా ఉన్నాను. అంతలోకే దయా అన్న ఎదురయ్యాడు. పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత..‘రాన్న రాన్న ఫొటో తీసుకుందాం’ అని దయా అన్న అన్నారు. నేను ఫొటో వద్దు ఏమీ వద్దు అని అక్కడినుంచి వచ్చేశా. అది చాలా మంది మిత్రులు అపార్థం చేసుకున్నట్లు ఉన్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులు. నేనంటే ఎంతో అభిమానంగా, ప్రేమతో చూస్తుంటారు.
మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఆయనతో ఉన్న చనువుతో నేను అలా సరదాగా తోసేశాను. దాన్ని నేను కావాలనే చేసినట్లు కొంతమంది మీడియా మిత్రులు అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. తర్వాత కూడా ఆయన, నేను ఫంక్షన్‌లో చాలా సేపు మాట్లాడుకున్నాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాం. ఆ వీడియో చూసి ఆయన, నేను నవ్వుకున్నాం. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. అలాంటిదేమీ లేదు’ అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
బీసీ రిజర్వేషన్లపై మరో మోసానికి తెర తీసిన కాంగ్రెస్: తలసాని
రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తా.. ముగ్గరు మృతి