Bengaluru Realestate: రూ.7 కోట్ల సంపద ఉన్న యువకుడి వింత నిర్ణయం.. నెట్టింట వైరల్
ABN , Publish Date - Dec 04 , 2025 | 03:20 PM
రూ.7 కోట్ల సంపద ఉన్నా ఇల్లు కొనేదేలేదంటూ ఓ యువకుడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితాంతం శ్రమించి తమకంటూ ఓ గూడును ఏర్పాటు చేసుకుంటారు. కానీ 32 ఏళ్లకే 7 కోట్లు సంపాదించిన ఓ యువకుడు మాత్రం సొంతిల్లు కొనేదే లేదంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. తన నిర్ణయానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది (Bengaluru Realestate Soaring Prices).
బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఈ పోస్టు పెట్టాడు. నగరంలో సొంతిల్లు కొనాలనుకోవడం ఆర్థికంగా మంచి నిర్ణయం కాదని, అర్థరహితమని చెప్పుకొచ్చాడు. రూ.2-3 కోట్లు పెట్టి ఇల్లు కొనే స్తోమత ఉన్నా అద్దె ఇంట్లో ఉండేందుకే నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.
‘నా వయసు 32 ఏళ్లు. నికర సంపద రూ.7 కోట్లు. నెలనెలా చేతికి రూ.3.7 లక్షల వరకూ వస్తుంది. ప్రస్తుతం జయానగర్‌లో 3బీహెచ్‌కే ఇంట్లో ఉంటున్నా. అద్దె నెలకు రూ.35 వేలు. ఇదే ప్లాట్ మార్కెట్ ధర ప్రస్తుతం రూ.8 కోట్లు. అంటే అద్దెల ద్వారా ఎంత తక్కువ ఆదాయం వస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంత రేటు పెట్టి ఆస్తి కొనడం అర్థరహితం’ అని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు.
బెంగళూరు శివార్లల్లో రూ.2-3 కోట్లు పెడితే ఇల్లు వస్తుందని, తనకు అంత స్తోమత ఉన్నా ఆసక్తి లేదని అన్నాడు. దుమ్మూధూళీ, రద్దీ ఎక్కువగా ఉండే వైట్ ఫీల్డ్, సర్జాపూర్, వర్తూర్ లాంటి ప్రాంతాలు తనకు అస్సలు నచ్చవని అన్నాడు. ‘జయనగర్‌లో కొనాలంటే ఒక్కసారిగా రూ.8 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇలా సంపద మొత్తాన్ని రియలెస్టేట్‌కు మళ్లించడం, ఆ తరువాత ధరలు పెరగాలంటే ప్రార్థనలు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు’ అని అన్నాడు. ఇదే డబ్బుతో విదేశాల్లో ముఖ్యంగా ఈయూ దేశాల్లో కొంటే శాశ్వత నివాసార్హత కూడా సాధించుకోవచ్చని అన్నాడు. ‘మీరూ ఇలాంటి సందిగ్ధంలో ఉన్నారా? ఈ మార్కెట్ రేటులో ఆస్తులు కొంటారా? అని ప్రశ్నించాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. జనాలు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
నెదర్‌ల్యాండ్స్‌లో పరిస్థితిపై భారతీయుడి వీడియో.. నెట్టింట భారీ చర్చ
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని.. ఆటో డ్రైవర్‌గా.. తాను ఎవరికీ బానిసను కానంటూ..