Upendra Hero Journey: ఉపేంద్ర హీరో అవ్వడానికి కారణం ఈ సీనియర్ హీరోయినే..
ABN , Publish Date - Jul 25 , 2025 | 07:56 PM
Upendra Hero Journey: ఉపేంద్ర నటించిన ఏ సినిమా విడుదలకు ముందు చాలా సమస్యలు ఎదుర్కొంది. సెన్సార్ అవ్వటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే చివరకు సీనియర్ నటి సరోజాదేవి కారణంగా సెన్సార్ పూర్తయింది.

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేవలం కన్నడలోనే కాదు.. తెలుగులోనూ ఆయన హీరోగా సినిమాలు చేశారు. కన్నడలో ఆయన చేసిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయి విడుదల అవుతుంటాయి. ఉపేంద్ర తీసే సినిమాలన్నీ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. కథ, కథనం, నటనలో ఆయన సినిమాలు సాధారణంగా విడుదలయ్యే అన్ని సినిమాల కంటే భిన్నంగా ఉంటాయి. ఇక, ఉపేంద్ర ‘ఏ’ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు.
ఆ సినిమా కన్నడలోనే కాదు.. తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, ఆ సినిమా విడుదలకు ముందు చాలా సమస్యలు ఎదుర్కొంది. సెన్సార్ అవ్వటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు సీనియర్ నటి బి.సరోజా దేవి కారణంగా సెన్సార్ పూర్తయింది. ఆమె కారణంగానే ఉపేంద్ర స్టార్ హీరో అయ్యారు. సరోజా దేవి చేసిన సాయం గురించి ఉపేంద్ర మాట్లాడుతూ...‘నా మొదటి సినిమా ‘ఏ’ సెన్సార్ దగ్గర ప్రాబ్లమ్ అయింది. ‘ఇలాంటి సినిమా రిలీజ్ అవ్వకూడదు’ అని చాలా మంది అన్నారు.
తర్వాత రివిజింగ్ కమిటీకి సినిమా వెళ్లింది. సినిమా చూసిన తర్వాత సరోజా దేవి నన్ను లోపలికి పిలిచారు. నేను వెళ్లగానే ఆమె నిలబడి చప్పట్లు కొట్టారు. నా మొదటి సినిమాను బాగుందని పొగిడిన మొదటి వ్యక్తి ఆ మహాతల్లే. ఆమె కారణంగానే సినిమా సెన్సార్ అయింది. నేను ఆమెను కలిసిన ప్రతీసారి ఆ విషయం గుర్తు చేసేవాడ్ని.
‘మీరే లేకపోతే.. నేను హీరో అయ్యేవాడ్ని కాదు’ అని అనేవాడ్ని. రాజ్ కుమార్, విష్ణువర్థన్ మాత్రమే కాదు.. సరోజా దేవి పేరు మీద కూడా అవార్డులు ఇవ్వాలి. ఆమె రెండు సార్లు సెంట్రల్ జ్యూరీ మెంబర్‌గా కూడా పని చేశారు. ఆమె సాధించిన విజయాలు ఏంటో అందరికీ తెలుసు. వాటి గురించి మాట్లాడేంత వయసు నాకు లేదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
డ్రైవర్ కొంపముంచిన పనస పండు.. తప్పు చేయకున్నా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..