Army Doctor: రియల్ హీరో.. హెయిర్ క్లిప్, కత్తితో మహిళకు కాన్పు చేసిన డాక్టర్..
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:24 PM
Army Doctor: గర్భిణిని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో కిందకు దింపారు. ఆలస్యం చేస్తే ఇబ్బంది అవుతుందని భావించిన డాక్టర్.. గర్భిణికి ప్లాట్ ఫామ్‌పైనే కాన్పు చేయటం మొదలెట్టాడు. ఓ హెయిర్ క్లిప్, కత్తి సాయంతో విజయవంతంగా ఆమెకు ఆపరేషన్ పూర్తి చేశాడు.

ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో మనసుకు హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ఓ ఆర్మీ డాక్టర్ డెలివరీ చేశాడు. అది కూడా హెయిర్ క్లిప్, కత్తి ఉపయోగించి ఆమెకు డెలివరీ చేశాడు. సదరు మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ గర్భిణి శనివారం పన్వేల్ - గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బరబంకీకి వెళుతోంది. రైలు ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు సమీపిస్తున్న సమయంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి.
ఈ విషయం రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఓ లేడీ చెకింగ్ స్టాఫ్, ఆర్మీ డాక్టర్ రోహిత్ బచ్‌వాలా గర్భిణికి సాయం చేయడానికి రంగంలోకి దిగారు. వీరితో పాటు మరికొంతమంది కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. గర్భిణిని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో కిందకు దింపారు. ఆలస్యం చేస్తే ఇబ్బంది అవుతుందని భావించిన డాక్టర్.. గర్భిణికి ప్లాట్ ఫామ్‌పైనే కాన్పు చేయటం మొదలెట్టాడు. ఓ హెయిర్ క్లిప్, కత్తి సాయంతో విజయవంతంగా ఆమెకు ఆపరేషన్ పూర్తి చేశాడు.
సదరు గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. గర్భిణికి కాన్పు చేసిన ఆర్మీ డాక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక, రోహిత్ బచ్‌వాలా మీడియాతో మాట్లాడుతూ.. ‘సరైన వైద్య పరికరాలు లేకపోవటంతో.. అందుబాటులో ఉన్న వాటితోటే డెలివరీ చేయాల్సి వచ్చింది. హెయిర్ క్లిప్, కత్తి సాయంతో డెలివరీ పూర్తయింది’ అని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
బాలికకు సీఎం యోగి హామీ.. లెక్కచెయ్యని స్కూలు యాజమాన్యం..
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య