Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారంటే..
ABN , Publish Date - Apr 25 , 2025 | 08:39 AM
అక్షయ తృతీయను అత్యంత శుభప్రదమైన రోజుగా పూర్వీకులు చెప్పారు. ఆ రోజు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడంవల్ల కలిసివస్తుందని, చాలా శుభప్రదమని అంటారు. అందుకే ఆ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఎక్కువగా మహిళలు ఇష్టపడతారు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, అక్షయ తృతీయ (Akshaya Tritiya)కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని తదియ తిథినాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అలాగే అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవి (Lakshmi Devi)కి సంబంధించిన పండగ... ఆ రోజు కుబేరుడిని కూడా పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం (Gold), వెండి వస్తువులు కొనుగోలు చేయడంవల్ల కలిసివస్తుందని, చాలా శుభప్రదమని భావిస్తారు. ఆ రోజున చేసిన దానాలు, పూజలు అక్షయంగా ఉంటాయని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ రోజున మనం కొనుగోలు చేసిన సంపద, ఆస్తి ఎప్పటికీ మనతోనే ఉంటుందని, దానితో పాటు సుఖ సంతోషాలు కూడా ఉంటాయని విశ్వాసం. ఈసారి ఈనెల 30వ తేదీన (బుధవారం) అక్షయ తృతీయ జరుపుకోనున్నారు.
Also Read..: పాకిస్థాన్ హైకమిషన్‌లోకి కేక్
బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావించి, అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేస్తారు. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనే నిబంధన మాత్రం ఎక్కడా లేదు. ఇది మహిళల విశ్వాసానికి సంబంధిన విషయం. పురాణాల ప్రకారం పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు వారికి చాలా ఆకలిగా ఉండడంతో సూర్య భగవానుడికి నమస్కరించి ఆహారం కావాలని అడుగుతారు. అప్పుడు సూర్య భగవానుడు వారికి ఒక అక్షయపాత్ర ఇస్తాడు. దీంతో పాండవులు వారికి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు అక్షయపాత్రను పూజించగానే ఆహారం అందిస్తుందనే నానుడి.
అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను కొనకూడదు..
అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను పొరపాటున కూడా కొనకూడదు.. ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్, అల్యూమినియం పాత్రలు, ఇనుప వస్తువులు, నలుపు రంగు దుస్తులను పొరపాటున కూడా కొనవద్దని పండితులు చెబుతున్నారు. వాటిని అక్షయ తృతీయ రోజున కొనడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశించే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు గ్రహ, వాస్తు దోషాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ శుభ సమయంలో వీటిని పొరపాటున కూడా కొనవద్దు.
పగలు నిద్రపోకూడదు..
అక్షయ తృతీయ రోజున పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత పొరపాటున కూడా నిద్రపోకూడదు. ఆ రోజు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈరోజు సాత్విక ఆహారమే తీసుకోవాలి. వివాదాలు, వాదనలకు దూరంగా ఉండాలి. శారీరకంగా లేదా మానసికంగా ఎవరికీ బాధ కలిగించకూడదు.. మూగ జీవాలకు, పేదలకు అన్నదానం చేస్తే మంచిది.
శుచీ, శుభ్రత పాటించాలి..
పురాణాలు, శాస్త్రాల ప్రకారం.. ఏ ఇంట్లో అయితే శుచీ, పరిశుభ్రత ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందంటారు. సూర్యోదయానికి ముందే ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుని, ఇంటి ముందు ముగ్గులు వేసి, ఇంట్లో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుంది. ఇంట్లో ఏ మూలనైనా చెత్తా, చీకటి, మురికిగా ఉంచొద్దు. పరిశుభ్రంగా ఉండే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇంకో విషయం ఎంటంటే.. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి, విష్ణువును పూజిస్తారు. కాబట్టి ఆ రోజున తులసి ఆకులను తుంచకూడదు.
అప్పులు చేయొద్దు..
అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అప్పులు చేయవద్దు. అలాగే ఆ రోజున ఎవరికీ అప్పు కూడా ఇవ్వవద్దు.. ఇది అశుభ సూచికంగా భావిస్తారు. అయితే అక్షయ తృతీయ రోజున ఆస్తిని లేదా ఇంటిని కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. అలాగే ఆ రోజు ఇంటి నిర్మాణానికి సంబంధించిన మరమ్మతులను చేయకూడదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి అరెస్టు
For More AP News and Telugu News