Share News

Kota Srinivasa Rao: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

ABN , Publish Date - Jul 13 , 2025 | 06:07 AM

Actor Kota Srinivasa Rao: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Kota Srinivasa Rao: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
Actor Kota Srinivasa Rao

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లో కూడా తన సత్తా చాటారు.


డాక్టర్ కావాలనుకుని యాక్టర్..

కోట శ్రీనివాసరావు 1942 జులై 10వ తేదీన కంకిపాడులో జన్మించారు. కోట తండ్రి సీతా రామాంజనేయులు డాక్టర్. కోట కూడా మొదట్లో డాక్టర్ కావాలనే అనుకున్నారు. అయితే, యాక్టింగ్ మీద ఆసక్తితో నాటకాల వైపు వచ్చారు. సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పని చేశారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో చివరగా ‘సువర్ణ సుందరి’ అనే సినిమాలో నటించారు.


2003లో వచ్చిన ‘సామి’ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో వచ్చిన ‘కాత్తాడి’ ఆయన చివరి తమిళ సినిమా. 1987లో విడుదలైన ‘ప్రతిఘాత్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2016లో విడుదలైన ‘భాగీ’ ఆయన చివరి హిందీ సినిమా. కన్నడలో 1997లో వచ్చిన ‘లేడీ కమిషనర్’తో ఎంట్రీ ఇచ్చారు. 2023 విడుదలైన ‘కబ్జా’ ఆయన చివరి కన్నడ సినిమా. కేవలం నటుడిగానే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా కూడా కొన్ని సినిమాలకు పని చేశారు.

40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 750 సినిమాల్లో నటించారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లలో బీజేపీలో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


ఇవి కూడా చదవండి

నేను జాతీయవాదిని

మండుతున్న రాష్ట్రం

Updated Date - Jul 13 , 2025 | 06:55 AM