Thackeray Cousins: సోదరుల అపూర్వ కలయిక.. 20 ఏళ్ల తర్వాత ఒకే స్టేజిపై..
ABN , Publish Date - Jul 05 , 2025 | 01:44 PM
Thackeray Cousins: ఉద్ధవ్ థాక్రే.. రాజ్ థాక్రే 2005లో చివరి సారిగా ఒకే స్టేజిపై కనిపించారు. తర్వాత శివసేనలో గొడవల కారణంగా పార్టీని రాజ్ వీడారు. 2006 మార్చి 9వ తేదీన సొంతంగా మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)ను స్థాపించారు.

ముంబై: అపూర్వ కలయికకు ‘మెగా విక్టరీ’ ర్యాలీ వేదికైంది. థాక్రే సోదరులు రాజ్ థాక్రే, ఉద్ధవ్ థాక్రేలు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించారు. థాక్రే సోదరులు తమ గొడవల్ని పక్కన పెట్టి కలిసిపోయారు. కలిసి వేదికను పంచుకున్నారు. మూడు భాషల విధానం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివ సేన (యూబీటీ), మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)లు కలిసి శనివారం ‘మెగా విక్టరీ’ ర్యాలీ నిర్వహించాయి. ఈ విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో థాక్రే సోదరులు పాల్గొన్నారు.
ఈ సభలో ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. ‘మనం ఇప్పుడు కలిశాం.. ఇకపై కలిసే ఉందాం. మన ప్రసంగాలకంటే.. మనం కలిసి ఉండటమే ముఖ్యం’ అని అన్నారు. ఈ సందర్భంగా రాజ్ థాక్రే మాట్లాడుతూ.. ‘ఓ విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. మా ఇద్దరి మధ్యా ఉన్న దూరాన్ని చెరిపేశాము’ అని అన్నారు. అన్నదమ్ముల కలయికతో రెండు పార్టీల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2005లో విడిపోయి.. 2025లో కలిశారు..
ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే 2005లో చివరిసారిగా ఒకే స్టేజిపై కనిపించారు. తర్వాత శివసేనలో గొడవల కారణంగా పార్టీని రాజ్ వీడారు. 2006 మార్చి 9వ తేదీన సొంతంగా మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)ను స్థాపించారు. ఇక అప్పటినుంచి అన్నదమ్ములిద్దరూ ఎడ ముఖం.. పెడ ముఖంగా ఉన్నారు. 2009లో ఎమ్ఎన్ఎస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఏకంగా 13 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడు వైరాన్ని మర్చిపోయి వారిద్దరూ కలవడంతో ఇరుపార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఇవి కూడా చదవండి
పెట్రోల్ విషయంలో గొడవ.. పోలీస్‌ను కొట్టిన పెట్రోల్ బంక్ సిబ్బంది..
ట్రంప్ ముందు మోదీ తలొంచుతారు.. రాహుల్ సెటైర్లు.