Italy Work Visa: భారీ స్థాయిలో వర్క్ వీసాలు జారీ చేయనున్న ఇటలీ.. వచ్చే మూడేళ్లల్లో..
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:20 PM
దేశంలోని పలు రంగాల్లో కార్మికుల కొరత నెలకున్న నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం చట్టబద్ధమైన వలసలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వచ్చే మూడేళ్లల్లో దాదాపు ఐదు లక్షల వీసాలు జారీ చేసేందుకు నిర్ణయించింది.

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కార్మికుల కొరతను అధిగమించేందుకు ఇటలీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లల్లో దాదాపు 5 లక్షల వర్క్ వీసాలను యూరోపియన్ యూనియన్ వెలుపలి దేశాల వారికి జారీ చేసేందుకు నిర్ణయించింది. అక్రమ వలసలకు, దేశ అవసరాలకు సమతౌల్యం పాటిస్తూనే ఈ నిర్ణయం తీసుకుంది.
సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 2026-28 మధ్య కాలంలో 497,550 కొత్త వర్క్ పర్మిట్‌లను జారీ చేయనున్నారు. తొలి విడతగా 2026లో 164,850 వర్క్ వీసాలను ప్రభుత్వం ఐరోపా సమాఖ్య వెలుపలి దేశాల వారికి జారీ చేయనుంది. చట్టబద్ధంగా వలసలను ప్రోత్సహించే వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లేబర్ కొరత తీవ్రంగా ఉన్న రంగాల్లో నిపుణులకు ఈ వర్క్ వీసాలను జారీ చేయనున్నారు.
సుమారు మూడేళ్ల క్రితం ఇటలీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన జార్జియా మెలోనీ నేతృత్వంలో జరుగుతున్న రెండో అతిపెద్ద వలసల కార్యక్రమం ఇది. 2023-25 మధ్య కాలంలో మెలోనీ సారథ్యంలోని ప్రభుత్వం 4.5 లక్షల పైచిలుకు వర్క్ వీసాలను జారీ చేసింది.
ఓవైపు విదేశీ కార్మికుల వలసలను ప్రోత్సహిస్తూనే ప్రధాని.. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. మెడిటరేనియన్ ప్రాంతం పరిధిలో హ్యూమానిటేరియన్ సంస్థల కార్యకలాపాలపై ఆంక్షలు, డిపోర్టేషన్‌లను పెద్ద ఎత్తున చేపడుతున్నారు.
ఇటలీలో జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వ్యాపార వాణిజ్య అవసరాల కోసం చట్టబద్ధమైన వలసలను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. గతేడాది ఇటలీ జనాభా 37 వేల మేరకు తగ్గింది. గత దశాబ్దకాలంగా అక్కడి జనాభాలో తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ జనాభా స్థిరీకరణ కోసం 2050 నాటికి 10 మిలియన్ల మంది విదేశీయులను దేశంలోని ఆహ్వానించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
అట్లాంటాలో తానా పికిల్ బాల్ టోర్నమెంట్ విజయవంతం
ఆసుపత్రిలో ఒంటరైన రోగికి ఆపన్నహస్తం.. సౌదీలో మానవత్వం చాటుకున్న తెలుగు మహిళ