Canada Minimum Wage Hike: కెనడాలో కనీస వేతన పరిమితి పెంపు.. అంతర్జాతీయ విద్యార్థులకు ఊరట
ABN , Publish Date - Apr 08 , 2025 | 06:17 PM
కెనడాలో జీవన వ్యయాలతో సతమతమవుతున్న భారతీయ విద్యార్థులకు ఊరట లభించింది. కనీస వేతన పరిమితిని అక్కడి ఫెడరల్ ప్రభుత్వం పెంచింది.

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో పెరుగుతున్న జీవన వ్యయాలతో అతలాకుతలమవుతున్న భారతీయులకు చాలా రోజుల తరువాత ఓ గుడ్ న్యూస్. ప్రైవేట్ రంగంలోని వారికి ఇవ్వాల్సిన కనీస వెతనాన్ని ప్రభుత్వం పెంచింది. ఒకప్పుడు గంటకు 17.30 డాలర్లు ఉండే కనీస వేతనాన్ని 17.75 డాలర్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చిన కొత్త వేతనాలతో కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు లాభించనుంది (Canada Minimum Wage Hike).
‘‘కనీస వెతన పరిమితి పెంపుతో అటు కార్మికులకు ఇటు వ్యాపారులకు లాభం కలుగుతుంది. దేశంలో నెలకున్న ఆర్థిక అంతరాలు కూడా తగ్గుతాయి. న్యాయమైన ఆర్థిక వ్యవస్థ రూపకల్పన దిశగా ఇదో కీలక ముందడుగు’’ అని కెనడా ఉద్యోగ కార్మిక శాఖ మంత్రి స్టీవెన్ మెకానన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫెడరల్ ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ఈ సవరింపును చేపట్టింది. దీంతో, అన్ని రాష్ట్రాల్లో అత్యధిక కనీస వేతనం అమల్లోకి రానుంది.
కనీస వేతన నిబంధనల మార్పులను తక్షణం అమలు చేయాలని ప్రభుత్వం వివిధ సంస్థలను కోరింది. ట్రెయినీ ఉద్యోగుల జీతాలకు ఈ మేరకు మార్పులు చేయాలని పేర్కొంది. దేశంలోని ధరల పెరుగుదలను బట్టి కెనడా ప్రభుత్వం ఏటా ఏప్రిల్ 1న కనీస వేతన పరిమితికి మార్పులు చేస్తుంది.
ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఆహారం కోసం ఫుడ్ కూపన్స్‌పై ఆధారపడుతున్న అంతర్జాతీయ విద్యార్థులు ఈ పెంపుతో ఊరట కలుగనుంది. ఫుడ్ బ్యాంకులకు జనాలు పోటెత్తుతుండటంతో కొన్ని అంతర్జాతీయ విద్యార్థులను తిప్పి పంపుతున్నాయి. మునుపటి జస్టిన్ ట్రూడో ప్రభుత్వ ఎదుర్కొన్న ప్రధాన విమర్శల్లో ధరల పెరుగుదల ప్రధానమైనదన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం కెనడా జనాభాలో భారతీయుల వాటా 3.7 శాతంగా ఉంది. కెనడాలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారిలో భారతీయ వర్కర్ల వాటా 22 శాతం. ఒకానొక నివేదిక ప్రకారం, కెనడా గిగ్ ఎకానమీలోని వర్కర్లలో అధికభాగం 2005 నుంచి 2020 మధ్య వలసొచ్చిన వారే. ఫలితంగా.. కెనడా వర్కర్లలో వీరి వాటా 5.05 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. కెనడాలో ఉంటున్న 1.35 మిలియన్ల మంది తాము భారత సంతతి వారమని తెలిపారు. రిటైల్, హెల్త్‌కేర్, నిర్మాణరంగంతో పాటు ఇతర రంగాల్లో భారతీయులు పనిచేస్తున్నారు. ట్రెయినీలకు కూడా ఈ పెంపు వర్తిస్తుండటంతో అక్కడి భారతీయ విద్యార్థులకు కూడా మేలు కలుగనుంది.
ఇవి కూడా చదవండి:
హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
దుబాయిలో జై శ్రీరాం నినాదాలతో శ్రీ రామ నవమి ఉత్సవాలు
బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి