Share News

Telangana UPSC Topper: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:09 AM

రాపర్తి ప్రీతి సివిల్స్‌లో 451 ర్యాంకు సాధించడమే కాకుండా, ఉద్యోగం చేస్తూ, గృహిణిగా ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ పరీక్షకు సన్నద్ధమయ్యారు. ఆన్‌లైన్‌ ద్వారా కోచింగ్ లేకుండా, కుటుంబం, పిల్లలను చూసుకుంటూ తన లక్ష్యాన్ని సాధించారు.

Telangana UPSC Topper: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ

ఓ వైపు ఉద్యోగం చేస్తూ.. మరో వైపు గృహిణిగా ఇంటి వ్యవహారాలను చూసుకొంటూ సివిల్స్‌లో 451 ర్యాంకు సాధించారు నగరానికి చెందిన రాపర్తి ప్రీతి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె... చిన్నప్పటి నుంచీ తన తండ్రి కష్టాన్ని చూసి పెరిగారు. నాన్న తనపై పెట్టుకున్న నమ్మకం... భర్త ప్రోత్సాహం... కోచింగ్‌ లేకుండానే సివిల్స్‌ ర్యాంకు సాధించిన ప్రీతిని ‘నవ్య’ పలుకరించింది.

‘‘మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మాది. మధ్య తరగతి కుటుంబం. ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండడంతో కుటుంబం కోసం మా అమ్మ అర్చన, నాన్న రాపర్తి నందకిశోర్‌ చాలా కష్టపడ్డారు. అన్నయ్య, నేను... ఇద్దరు సంతానం. నేను కీస్‌ హైస్కూల్‌లో చదివాను. 2016లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యాను.


పాపను చూసుకొంటూ...

సివిల్స్‌కు నేను ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. 2019లో మొదటిసారి సివిల్స్‌ పరీక్ష రాస్తే... మెయిన్స్‌ వరకు వెళ్లాను. 2021లో నాకు పెళ్లయింది. నా పెళ్లి తరువాత మా నాన్న చనిపోయవారు. నాకు మూడేళ్ల పాప. తనను చూసుకొంటూనే ఉద్యోగం చేసుకుంటున్నాను. కొవిడ్‌ నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కావడం కాస్త కలిసొచ్చింది. ఇంట్లో పాపను, కుటుంబాన్ని చూసుకుంటూ ఉద్యోగం చేసుకొనే అవకాశం లభించింది.

మావారి ప్రోత్సాహంతో...

ఎలాగైనా సివిల్స్‌ సాధించాలన్నది నా కల. మావారు ఆదిమూలం శివప్రసాద్‌ నాకు అండగా నిలిచారు. నన్ను ప్రోత్సహించారు. అయితే చంటిపాప, ఇంటి పనులు, ఉద్యోగం... వీటన్నిటితో సివిల్స్‌కు సన్నద్ధమవ్వడం సాధ్యం కాదేమోననే సందేహం కలిగింది. అదే విషయం ఆయనకు చెబితే... ‘ఇంటి పనులు, ఉద్యోగం వదిలేసైనా సరే సివిల్స్‌ కోచింగ్‌కు వెళ్ల’మన్నారు. సివిల్స్‌ పరీక్ష రాసి నాలుగేళ్లు అవుతుందని, కొత్త తరంతో పోటీపడడం కష్టమని అన్నాను. కానీ ఆయన నాలో స్ఫూర్తి నింపారు. దాంతో రెండేళ్ల కిందట పట్టుదలగా సివిల్స్‌ కోసం ప్రిపరేషన్‌ ప్రారంభించాను.


ఆన్‌లైన్‌లోనే...

కోచింగ్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే సమాచారం సేకరించాను. నాకున్న సందేహాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారానే నివృత్తి చేసుకున్నా. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నాకు చాలా కలిసివచ్చింది. అప్పుడప్పుడూ ఆఫీసుకు వెళ్లేదాన్ని. మా కుటుంబం కూడా అండగా నిలిచింది. అన్నీ సమన్వయం చేసుకుంటూ కష్టపడ్డాను. ఇంటర్వ్యూకు ఎంపికయి నప్పుడు కూడా ఎలాంటి కోచింగ్‌కూ వెళ్లలేదు. ఇంటర్వ్యూ విధానం... జవాబులివ్వాల్సిన పద్ధతి తదితర విషయాలన్నీ ఆన్‌లైన్‌లోనే తెలుసుకున్నా.

హైడ్రా గురించి ఆరా...

ఇంటర్వ్యూలో హైడ్రా గురించి అడిగారు. తెలంగాణలో చిన్న జిల్లాల ఏర్పాటుతో లాభనష్టాలు, రాష్ట్రం అప్పుల్లో కూరుకపోవడానికి గల కారణాలను కూడా అడిగారు. ఇక నేను చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి సంబంధించి ప్రశ్నలు వేశారు. ఎక్కడా తడబడకుండా నాకు తెలిసిన విషయాలను చెప్పాను. ఇంటర్య్వూ నాకు చాలా సంతృప్తినిచ్చింది. 451 ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. ర్యాంకు వస్తుందని ఊహించలేదు. చంకలో బిడ్డ, ఉద్యోగం, కుటుంబం... అన్నీ చూసుకొంటూ సివిల్స్‌ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వడం కష్టమే. కానీ... నా లక్ష్యం ముందు అవన్నీ చిన్నవే అనిపించాయి.’’

-బయ్య దామోదర్‌


ఇవి కూడా చదవండి

జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..

Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..

Updated Date - Apr 23 , 2025 | 12:09 AM