Share News

జ్ఞాననేత్రం

ABN , Publish Date - May 30 , 2025 | 05:13 AM

వర్ధమాన మహావీరుడికి ఎందరో శిష్యులు ఉండేవారు. వారిలో గోశాలక్‌ ఒకడు. అతను పండితుడు. వాక్చాతుర్యం ఉండేది. అయినా ఎక్కువమంది మహావీరునివైపే ఆకర్షితులు కావడం చూసి... అతనికి లోలోపల కొంత...

జ్ఞాననేత్రం

సద్బోధ

వర్ధమాన మహావీరుడికి ఎందరో శిష్యులు ఉండేవారు. వారిలో గోశాలక్‌ ఒకడు. అతను పండితుడు. వాక్చాతుర్యం ఉండేది. అయినా ఎక్కువమంది మహావీరునివైపే ఆకర్షితులు కావడం చూసి... అతనికి లోలోపల కొంత అసూయగా ఉండేది. ఒకసారి మహావీరుడు, గోశాలక్‌ కాలినడకన పొరుగు ఊరికి వెళుతున్నారు. కాలిబాట పక్కన ఒక చోట చిన్న పూల మొక్క ఉండడం గోశాలక్‌ గమనించాడు. దాన్ని మహావీరుడికి చూపిస్తూ ‘‘గురువర్యా! ఈ పూల మొక్కను చూడండి. ఇది పెరిగి పెద్దదవుతుందంటారా? పూలు పూస్తుందంటారా?’’ అని ప్రశ్నించాడు.

ఎవరో ఒక మనిషి భవిష్యత్తు గురించి అడిగితే... జ్యోతిష్కులు ఆ వ్యక్తి పుట్టిన రోజు, సమయం, ప్రాంతం తెలుసుకుంటారు. తిథి, వార, నక్షత్ర, గ్రహ స్థితులను పరిగణనలోకి తీసుకొని, లెక్కలు వేసి... ఆ మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతారు. కానీ మొక్కల భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తే... పేరుమోసిన జ్యోతిష్కులైనా ఏమీ చెప్పలేరు. నవ్వి ఊరుకుంటారు. ఈ ప్రశ్న వేసి, మహావీరుడు ఏ సమాధానం చెబుతాడా? అని గోశాలక్‌ ఎదురుచూస్తున్నాడు.

ఆ ప్రశ్న విన్న మహావీరుడు ఆ మొక్క దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు గోశాలక్‌ ‘‘తప్పించుకొనే ప్రయత్నం చేయకండి. నా ప్రశ్నకు కచ్చితమైన జవాబు ఇవ్వండి’’ అన్నాడు.

మహావీరుడు కళ్ళు తెరిచి, లేచి నిలబడి ‘‘ఈ మొక్క పెరిగి పెద్దదవుతుంది. సమృద్ధిగా పూలు పూస్తుంది’’ అని చెప్పాడు.

గోశాలక్‌ ‘‘అవునా!’’ అంటూ ఆ మొక్కను కూ


కటివేళ్ళతో సహా పెకిలించి అవతల పారేశాడు. ‘‘ఇది పెరుగుతుందట! పూలు పూస్తుందట!’’ అని నవ్వాడు. మహావీరుడు చిరునవ్వులు చిందిస్తూ ముందుకు నడిచాడు. గోశాలక్‌ ఆయనను అనుసరించాడు.

వారిద్దరూ కొంత దూరం వెళ్ళాక... ఆ ప్రాతంంలో పెద్ద వర్షం మొదలైంది. ఏడు రోజులపాటు ఎడతెరిపిలేని వానలు, గాలులతో ఆ ప్రదేశమంతా చిందరవందరయింది. వానలు తగ్గడంతో మహావీరుడు, గోశాలక్‌ తిరుగు ప్రయాణం ప్రారంభించి, మళ్ళీ ఆ మొక్క ఉన్న చోటికే వచ్చారు. గాలీ, వర్షం కారణంగా ఆ మొక్క అటూ దొర్లి, ఇటు దొర్లి... మళ్ళీ దాన్ని వేర్లు భూమిలో నిలిచేలా లేచి నిలబడింది. దాన్ని ఆశ్చర్యంతో గమనించిన గోశాలక్‌... మహావీరుడి వైపు చూశాడు.


అప్పుడు మహావీరుడు నవ్వుతూ ‘‘ఆ మొక్క పెరిగి పెద్దదై... పూలు పూసే దృశ్యాన్నే కాదు, నువ్వు దాన్ని కూకటి వేర్లతో పెకిలించి పారేసే దృశ్యాన్ని కూడా ఆనాడే చూశాను. ఒక్కసారి కాదు, వందసార్లు నీవు అలా చేసినా... ఆ మొక్క కచ్చితంగా పెరుగుతుంది. పూలు పూస్తుంది. ఇది తథ్యం’’ అంటూ ముందుకు కదిలాడు. సాధారణ జ్యోతిష్కులు ఏవేవో లెక్కలు వేయాల్సి ఉంటుందేమో! జ్ఞానులు తమ జ్ఞాననేత్రంలో దర్శించి చెప్పేది నిజం కాక తప్పదు.

రాచమడుగు శ్రీనివాసులు

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ టూర్.. బయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. మూడు ఫ్యామిలీలను పోషించలేక..

Updated Date - May 30 , 2025 | 05:13 AM