Share News

ఆత్మజ్ఞానమే శ్రేష్టమైన విద్య

ABN , Publish Date - May 30 , 2025 | 05:23 AM

నేను మీకొక సరళమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎంతోమంది ఎన్నో రకాలైన కథలు వినిపిస్తారు. ఎక్కడో జరిగిన సంగతుల గురించి చెబుతారు. కానీ మీ గురించి, మీ జీవితం గురించి చెప్పాలని అనుకుంటున్నాను...

ఆత్మజ్ఞానమే శ్రేష్టమైన విద్య

చింతన

నేను మీకొక సరళమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎంతోమంది ఎన్నో రకాలైన కథలు వినిపిస్తారు. ఎక్కడో జరిగిన సంగతుల గురించి చెబుతారు. కానీ మీ గురించి, మీ జీవితం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే... మీ జీవితంలో మీరే ప్రముఖమైన వ్యక్తి. చాలామంది భగవంతుడు ముఖ్యమైనవాడని భావిస్తారు. కానీ మీకు భగవంతుడు అవసరమని అనిపించినప్పుడు మాత్రమే ఆయన ముఖ్యుడవుతాడు. ఆయన గురించి మీరు తెలుసుకోకూడదనుకుంటే... మీ ప్రపంచంలో ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు.

తెలుసుకోవాల్సింది అదే...

మిమ్మల్ని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రఖ్యాత గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్‌ తన బోధలలో ‘నిన్ను నీవు తెలుసుకో, అర్థం చేసుకో’ అనేవాడు. ఇదే విషయాన్ని కబీర్‌దాస్‌ కూడా చెప్పాడు. ‘ఆత్మజ్ఞానం’ అంటేనే నిన్ను నువ్వు తెలుసుకోవడం. మనం ప్రతిదాన్నీ తెలుసుకోవాలనుకుంటాం. ‘ఇదేమిటి, అదేమిటి, అతనెవరు, ఏం చేస్తూ ఉంటాడు’?... ఇలా ప్రతి దాని గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మనిషి తను ఎవరో తెలుసుకోవడం కోసం ఎన్నడూ తనవైపు తిరిగి చూసుకోడు. మానవులమైన మనకు సంబంధించి ప్రధానమైన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి మనం జన్మించడం. జన్మించాం కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. రెండోది... మనం జన్మించాం కాబట్టి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపోవడం కూడా తప్పనిసరిగా జరుగుతుంది. కానీ ఈ రెండో మాట చాలామందికి నచ్చదు. అలా జరగకుండా ఉండాలని ఎంతోమంది అనేక రకాల పాట్లు పడుతూ ఉంటారు. పరిగెడతారు, వ్యాయామం చేస్తారు, పద్ధతిగా తింటారు, బరువు పెరగకుండా చూసుకుంటారు. ఎందుకంటే మనమనందరం ఎప్పటికీ బ్రతికే ఉండాలని కోరుకుంటాం. ఏదో ఒక రోజు అంతమైపోతామనేది ఆలోచించాలని కూడా అనుకోం.


ఆ ఆనందం మీ సొంతం

సరే... ఇంతకు మీరెవరు? ఏఏ పదార్థాలతో మీరు తయారయ్యారో తెలుసా? ఆక్సిజన్‌, హైడ్రోజన్‌, కార్బన్‌, కాల్షియం, నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌... ఈ మూలకాలతో మీరు తయారయ్యారు. మీలో ఉన్నదానిలో డెబ్భై శాతం నీరే. ఈ నీరు నడుస్తుంది, మాట్లాడుతుంది... ఇది అద్భుతం కాదా? కానీ దీన్ని మీరు అద్ఫుతంగా భావించరు. ఈ భూమండలంలో కూడా డెబ్భై శాతం నీరు. మీరు కూడా డెబ్భై శాతం నీరే! బయట జరుగుతున్న వాటిని చూసి ఆశ్చర్యపోవడం మీ నైజం. కానీ మీలోపల జరుగుతున్న వాటిని చూసి ఆశ్చర్యపోవాలని నేను చెబుతున్నాను. ఏ పదార్థాలతో మీరు తయారయ్యారో... బయట ఉన్నవన్నీ కూడా ఆ పదార్థాలతోనే తయారయ్యాయని గ్రహించండి. మీ లోపలికి వస్తూ పోతున్న శ్వాస మీ సొంతం. అందులో దాగి ఉన్న ఆనందం కూడా మీ సొంతమే. అందువల్ల మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా మిగిలినవన్నీ తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా ఎటువంటి తేడా ఉండదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనే ఆరాటం మీకు కలగనంతవరకు జీవితం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. జీవితాన్ని కొనసాగించడానికి మీకు ఈ సమయం లభించింది.


అసలైన ఆనందంతో మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలితే... తద్వారా కలిగే ఆనందాన్ని మీరు మాత్రమే ఆస్వాదించగలరు. మీలో ఉన్న, మీ హృదయంలో ఉన్న దైవాన్ని తెలుసుకొని, స్వయంగా అనుభూతి చెందితే... సమస్తం మీరు తెలుసుకున్నట్టేనని వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఆత్మజ్ఞాన విద్యే అన్ని విద్యల్లో శ్రేష్టమైన విద్య. కాబట్టి తనను తాను తెలుసుకున్న వ్యక్తికి మాత్రమే తాను ఇక్కడ ఎందుకు జీవిస్తున్నదీ తెలుస్తుంది.

ప్రేమ్‌రావత్‌

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ టూర్.. బయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. మూడు ఫ్యామిలీలను పోషించలేక..

Updated Date - May 30 , 2025 | 05:23 AM