Nurse to MP: 45శాతం మేమే
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:13 AM
నర్సుగా మొదలైన ఫరా రూబీ ప్రస్థానం, కొవిడ్ సమయంలో సేవలతో రాజకీయం వైపు మళ్లింది. స్విట్జర్లాండ్ పార్లమెంటు ఎంపీగా ఎన్నికై, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం ఆమె చేస్తున్న పోరాటం గొప్పది

అతిథి
శ్రీలంకలో పుట్టారు. ఆరేళ్లకే కుటుంబంతో సహా స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడే నర్సింగ్ విద్య అభ్యసించారు. కొవిడ్ సమయంలో అత్యవసరమైన వైద్య సేవలు అందించారు. నర్సింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా హక్కుల కోసం పోరాటం చేశారు. ఆ నేపథ్యమే ఆమెను రాజకీయాల వైపు నడిపించింది. గ్రెంచెన్‌బర్గ్ మున్సిపల్ కౌన్సిలర్‌గా, సొంత రాష్ట్రం సోలోధర్న్ కౌన్సిల్ సభ్యురాలిగా... ఆ తరువాత స్విట్జర్లాండ్ పార్లమెంటు ఎంపీగా గెలిచారు. రాజకీయ నాయకురాలిగానే కాకుండా... ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యారు... స్విట్జర్లాండ్ ఎంపీ ఫరా రూబీ. హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆమెతో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
‘భారత్ సమ్మిట్’ లక్ష్యం ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులన్నీ ఒకచోట చేరి... సమానత్వం, శాంతి, సౌభ్రాతృత్వం, న్యాయ సాధనల కోసం ఒక విధానం, ఒక కార్యాచరణ తయారు చేయడం.
నర్సింగ్ సేవల నుంచి రాజకీయాల వైపు పయనం ఎలా? ఎందుకని?
నర్సింగ్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా. మేముండే గ్రెంచెన్‌బెర్గ్‌లోనే పని చేసేదాన్ని. అయితే కొవిడ్‌లో భయంకర పరిస్థితులు చూడాల్సి వచ్చింది. ఆ మహమ్మారి అప్పటివరకు వైద్య రంగంలో ఉన్న అనేక లోపాలను బయటపెట్టింది. అయితే దాని ఫలితం అనుభవించింది మాత్రం సంరక్షణ సేవలు అందిస్తున్న నర్సులు, సహాయకులు, వైద్యులే. కొవిడ్‌లో నిరంతరాయంగా పని చేశాం. ఒకసారి 48 గంటలపాటు నిరంతరంగా సేవలు అందించాం. ఆ సమయంలో నాతో పని చేసే ఒకామె బోరున ఏడ్చింది. ఆ పరిస్థితుల్లో పని చేయడం అత్యంత అవసరం. కానీ అంత సుదీర్ఘ పని గంటలు మానసికంగా దెబ్బతీసేవి. అంతే కాకుండా అటు ప్రజలతో పాటు ఇటు సంరక్షకులుగా ఉన్న మాకూ రక్షణ లేకుండా పోయింది. అప్పటికి మా రాష్ట్ర నర్సింగ్ సంఘం ఉపాధ్యక్షురాలిగా ఉన్న నేను... సంరక్షకులకు కూడా రక్షణ ఉండాలనే ప్రచారం ప్రారంభించా. దీనికి ప్రజలు, రోగుల నుంచి కూడా మద్దతు లభించింది. ఈ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఒక కార్మిక సంఘం పెట్టిన ప్రతిపాదన స్విట్జర్లాండ్ లో తొలిసారి 61 శాతం ఓట్లతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే నాకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వచ్చింది. ఆ లక్ష్యంతోనే ‘సోషల్ డెమొక్రటిక్ పార్టీ’లో చేరా. తొలుత మా గ్రెంచెన్‌బర్గ్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికయ్యా. ఆ తర్వాత సోలోథర్న్ కౌన్సిల్ సభ్యురాలిగా గెలిచా. అనంతరం స్విట్జర్లాండ్ పార్లమెంటు దిగువసభ సభ్యురాలిగా ఎన్నికయ్యా.
స్విట్జర్లాండ్‌లో పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు ఏ స్థాయిలో ఉంటుంది? మీకెంత ఖర్చయింది?
ఎన్నికల్లో డబ్బు అవసరం అనేది అంత ముఖ్యం కాదు. అయితే మా దేశంలోనూ డబ్బు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకునేవారు ఉన్నారు. కానీ డబ్బున్నవాళ్లు చాలామంది ఎన్నికల్లో గెలవలేదు. నేను కొన్ని వందల స్విస్ ఫ్రాంక్స్ మాత్రమే ఖర్చు చేశా. మా నియోజకవర్గాల్లో భారత్‌లోలా భారీ సంఖ్యలో ఓటర్లు ఉండరు. మాదేశ జనాభానే 89 లక్షలు. నా నియోజకవర్గ జనా భా 30 వేల మంది. అందులో ఓటర్లు ఇంకా తక్కువమంది ఉంటారు. నా ఉద్దేశంలో రాజకీయాల్లో డబ్బుకు ఉన్న ప్రాముఖ్యత కొద్ది శాతమే. అదే సమయంలో రాజకీయాల్లో తెలివితేటలతో సంబంధం లేదు. స్మార్ట్‌గా మాత్రం ఉండాలి. స్విస్‌లో భారీ డబ్బు అవసరం లేదు. ఒక ఆలోచన కావాలి. దానిపై పని చేయాలి. మార్పు కోసం పోరాడాలి. నేను నర్సును. నర్సులు, వైద్యులం కొవిడ్‌లో ఏం కావాలో చూశాం. రాజకీయంగా చేసిందేమీ లేదు. మేం సేవ చేశాం. మార్పు కోసం ప్రయత్నించా. అనేక అంశాలపై మాట్లాడా. ప్రజలతో ఉన్నా. ఆ తర్వాత ఎంపీ అయ్యా.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సామాజిక, న్యాయ సవాళ్లు ఏంటి?
ప్రపంచ వ్యాప్తంగా రైట్ పార్టీలు ఎన్నికవడంతో సమస్యలు వస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఇది సమస్యలకు దారి తీస్తుంది. ఇక మా దేశంలో ద్వేషం, తప్పుడు సమాచారం, లింగ సమానత్వం ప్రధాన సవాళ్లు. మాది బలమైన ప్రజాస్వామ్య దేశమే అయినా కొన్ని సమస్యలున్నాయి. భవిష్యత్తులో ఏమవుతుందో అన్న భయం కూడా ఉంది. అదే సమయంలో జీవన వ్యయం పెరిగిపోతోంది. మాది ధనిక దేశమే. కానీ పేద ప్రజలూ ఉన్నారు. అంతేకాదు... ఆసియా దేశాలతో పోలిస్తే ఎంతో ఉన్నతంగా స్విస్ ఉన్నా... మా దేశంలోనూ గత మూడు నెలల్లో 14 భ్రూణ హత్యలు జరిగాయి. ఆడపిల్లలను గర్భంలోనే చంపేశారు. అందుకే వచ్చే అక్టోబరులో మా దేశంలో లింగ సమానత్వంపై ఒక సదస్సు పెట్టాం.
సామాజిక న్యాయం సాధించేందుకు ఎలాంటి విధానాలు కావాలంటారు?
క్లిష్టమైన ప్రశ్నే. ప్రస్తుతం అనేక దేశాల మధ్య భారీ వాణిజ్య, స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాలు జరుగుతున్నాయి. మరోవైపు సుంకాల యుద్ధం కూడా జరుగుతోంది. కానీ ఈ వాణిజ్య, వ్యాపార ఒప్పందాలే కాదు... సామాజిక న్యాయం, లింగ సమానత్వం లాంటివి కూడా కావాలి. వీటి కోసం ప్రతి స్థాయిలో సంస్కరణలు కావాలి. మనం ఎలాంటి సమాజంలో జీవించాలని అనుకుంటున్నామనేది ముఖ్యం. దానికి అనుగుణంగా, అందులో అంతా ఉండేలా విధానాలు రూపొందించుకోవాలి. దానికి భారత్ సమ్మిట్‌లాంటివి ఉపకరిస్తాయి.
ప్రపంచ సంతోషకర దేశాల్లో స్విట్జర్లాండ్ మూడో స్థానంలో ఉంది? ఎలా?
మేం మా లక్ష్యం ఏంటో తెలుసుకుంటాం. దాని కోసమే పనిచేస్తాం. అదే సమయంలో ఆ లక్ష్యం సాధించేశాం అనుకుంటే... ఆ తర్వాత వెంటనే ఇంకా ప్రపంచ బాగుకోసం ఏం చేయాలి. మనిషి జీవితం బాగుండేందుకు ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తాం. అయితే ఒత్తిడితో పని చేయం. ఇష్టంతోనే, ఇష్టమైన రంగంలోనే పని చేస్తాం. అదే బహుశా మా సంతోషానికి కారణాల్లో ఒకటి కావొచ్చు.
కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిపై మీ స్పందనేంటి?
మనసును పిండేసే ఘటన. దుర్మార్గం. అంతా ఖండించాల్సిందే. చర్చలు, పరస్పరం మాట్లాడుకోవడం, అదే సమయంలో ఉగ్రవాదంపై పోరు చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో విడిపోవడం కాదు. దేశమంతా దీనికి వ్యతిరేకంగా నిలబడాలి. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం.
మీ దేశంలో మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు ఉన్నాయా?
స్విస్‌లో మహిళలకు మంచి ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రగతిశీలంగా ఉన్నాం. మహిళల విద్య చాలా ఎక్కువ. మేం చాలా ఇన్నోవేటివ్‌గా ఉంటాం. మా దేశానికి వలసలు ఎక్కువ. దేశ జనాభాలో 33 శాతం వలస వచ్చినవారే. అయితే స్విస్, విదేశీయులు అన్న తేడా అక్కడ ఉండదు. అందరికీ సమానావకాశాలే. ఇక మా దగ్గర రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు లాంటివి లేవు. అయినా మొత్తం చట్టసభల సభ్యుల్లో 45 శాతం మంది మహిళలమే ఉన్నాం. మా దగ్గర రెండు సీట్లు ఉంటే ఒకటి మగ, ఒకటి ఆడ అన్నట్లుగానే అనుకుంటాం. అలాగని దానికి సంబంధించిన కచ్చితమైన నిబంధన ఏదీ లేదు. కానీ అది పూర్తిగా లాజిక్ కదా! సమానత్వం ఉండాలి కదా!
-ఉప్పులూరి మురళీకృష్ణ
హైదరాబాద్