Share News

Obesity Prevention Tips: ఊబకాయానికి ఇది కూడా కారణమే

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:02 AM

సాధారణంగా మన ఇళ్లలో ఇంటి మొత్తానికీ కలిపి వంట చేస్తారు. కుటుంబసభ్యుల్లో

Obesity Prevention Tips: ఊబకాయానికి ఇది కూడా కారణమే

ప్రతి రోజూ పంచుకునే భోజన పద్ధతులు, దినచర్యలూ... ఆరోగ్యాన్నీ, శరీర బరువునూ ప్రభావితం చేస్తున్నట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలోనే ఊబకాయ పరిష్కార మార్గాలను కూడా ఐసీఎంఆర్‌ సూచించింది. ఆ వివరాలు తెలుసుకుందాం!

BNC.jpg

సాధారణంగా మన ఇళ్లలో ఇంటి మొత్తానికీ కలిపి వంట చేస్తారు. కుటుంబసభ్యుల్లో ఎవరికి వారికంటూ ప్రత్యేకమైన వంట నియమాలేవీ ఉండవు. పోషకాల అవసరతల ఆధారంగా వంటలు వండే విధానాలు అంతకంటే ఉండవు. ప్రధానంగా అన్నం, నూనెలో వేయించిన వేపుళ్లు, కూరలు, తీపి పదార్థాలతోనే మన భోజనం పూర్తవుతూ ఉంటుంది. ఇలా అందరికీ ఒకే భోజనం అలవాటు వల్ల, కుటుంబసభ్యుల్లో ఎవరికి వారికి వాళ్ల వయసుకూ, శారీరక శ్రమలకూ అవసరమైన పోషకాలు అందకపోవచ్చు. ప్రత్యేకించి మహిళలు కుటుంబంలో ఎక్కువ పోషక లోపానికి లోనవుతూ ఉంటారు. కుటుంబం తిన్న తర్వాత భోంచేసే అలవాటుతో పోషకాల లోపానికి గురయ్యే ఇలాంటి మహిళలతో పాటు, దేన్నీ మిగల్చకూడదనే ఉద్దేశంతో మిగిలినవన్నీ తినేయడం వల్ల తేలికగా ఊబకాయం బారిన పడే మహిళలూ ఉంటారు.

వంటపని పంచుకుంటూ...

కలిసి పంచుకునే భోజన అలవాట్లతో, ఒబేసిటీ, హైపర్‌టెన్షన్‌, టైప్‌2 మధుమేహం, గుండెజబ్బులతో పాటు పునరుత్పత్తి సమస్యలను కూడా కలిసి పంచుకునే ముప్పు పొంచి ఉంటుందంటున్నారు వైద్యులు. తెలియకుండానే పోషకలోపాలతో కూడిన అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లనూ, ఎక్కువ సమయాల పాటు కదలకుండా కూర్చునే సెడెంటరీ జీవనవిధానాన్నీ దంపతులు కలిసి పంచుకుంటూ ఉంటారు. దాంతో జీవనశైలి సంబంధిత రుగ్మతలు ఇద్దర్నీ ఏకకాలంలో వెంటాడుతూ ఉంటాయి. నిజానికి ఆరోగ్యకరమైన వంటకాలను వండుకోవడం శ్రమతో కూడుకున్న వ్యవహారం కానే కాదు. భార్యలు తామొక్కరే వంటగదిలో శ్రమపడుతున్నట్టు చెప్తూ ఉంటారే తప్ప, వంటపనిలో భర్త, పిల్లల సహాయాన్ని తీసుకోడానికి మాత్రం ముందుకు రారు. వంట తన సొత్తే అన్నట్టు, వంటగది తన సామ్రాజ్యం అన్నట్టు వ్యవహరించకుండా వంటపనిలో భర్త, పిల్లల సహాయం తీసుకోగలిగితే పని తేలికవడంతో పాటు, పోషక ప్రాధాన్యతలతో వంటలను వండుకునే వెసులుబాటు చిక్కుతుంది. అలాగే దంపతులిద్దరూ భోజనాలను వండుకుంటున్న విధానం మీద కూడా దృష్టి పెట్టాలి. తోచింది వండుకుని తినేయడం కాకుండా, అదనపు క్యాలరీలు దరి చేరకుండా తక్కువ నూనెతో, పోషకాలు నష్టపోకుండా వండుకునే విధానాలను నేర్చుకోవాలి. తక్కువ క్యాలరీలను అందించే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. అన్నం బదులు మిల్లెట్స్‌ తినడం, వేపుళ్లకు బదులు ఆవిరి మీద మగ్గించిన కూరగాయ ముక్కలు తినడం లాంటి అలవాట్లు అలవరుచుకోవాలి. అలాగే పప్పు, కూరగాయలను విడిగా ఉడికించుకుని ఎవరి అవసరతలకు తగ్గట్టుగా కారం, ఉప్పు, నూనెలను జోడించుకోవచ్చు.


నియమనిబద్ధతలతో...

సగం కంచం కూరగాయలతో, పావు కంచం పొట్టుతీయని ధాన్యాలు, మిగతా పావు కంచం ప్రొటీన్‌తో నింపుకోవడం మొదలుపెట్టాలి. ఆకుకూరలు, పులిసిన పదార్థాలు, స్థానిక ధాన్యాలతో కూడిన సంప్రదాయ వంటకాలకు పెద్ద పీట వేయగలిగితే దంపతులిద్దరితో పాటు వారి పిల్లల ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది. అలాగే కుటుంబమంతా కలిసి బయటి ఆహారానికి బదులుగా ఇంటి భోజనానికే కట్టుబడి ఉండాలనే నియమాలు కూడా ఆచరించాలి. రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేయడం, టివి ముందు కూర్చుని చిరుతిళ్లు తినడం లాంటి అలవాట్లకు స్వస్థి చెప్పాలి. అలాగే దైనందిన జీవితంలో వ్యాయామానికి తప్పనిసరిగా చోటు కల్పించాలి.

-గోగుమళ్ల కవిత

కుటుంబ సమస్య

ముందు రెండు టైర్లూ ఒకే వైపు ప్రయాణిస్తేనే కారు క్షేమంగా గమ్యానికి చేరుకోగలుగుతుంది. ఒక టైరు ఒక దిక్కుకూ, మరో టైరు మరో దిక్కుకూ ప్రయాణిస్తే గమ్యం చేరుకోలేకపోగా, ప్రమాదానికి గురయ్యే అవకాశాలుంటాయి. ఇదే సూత్రం కుటుంబానికీ వర్తిస్తుంది. ఒబేసిటీ వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. ఇది కుటుంబ సమస్య. కుటుంబంలో ఒకరు ఒబేసిటీతో బాధపడుతున్నారంటే ఆ కుటుంబమంతా ఆ సమస్య ప్రభావానికి లోనవుతుందని అర్థం. మునుపు దంపతుల్లో ఒకరు ఒబేసిటీతో ఆస్పత్రులకు వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అదే సమస్యతో దంపతులిద్దరూ ఆస్పత్రులకు వస్తున్న సందర్భాలు పెరిగిపోయాయి. అందరూ ఒకే రకమైన అనారోగ్యకరమైన ఆహారశైలిని అనుసరించడమే ఇందుకు కారణం. ఇంటి భోజనంలో నూనెల వాడకం పెరగడంతో పాటు, ప్రతి ఇంట్లో అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లు పెరిగిపోయాయి. స్విగ్గీలు, జొమాటోలతో కోరుకున్న ఆహారం ఇంటికే చేరుతోంది. దీనికి తోడు వ్యాయామ లోపం. వెరసి ప్రతి ఇంట్లో స్థూలకాయం కనిపిస్తోంది. దంపతులే కాదు పిల్లలు కూడా స్థూలకాయులవుతున్నారు. ఆహార నియమాలు, వ్యాయామాలతో ఈ సమస్యను చాలావరకూ అదుపులోకి తెచ్చుకోవచ్చు. పోషక లక్ష్యాలకు తగ్గట్టుగా ఇంటి భోజనంలో మార్పులు చేసుకోవడం, దైనందిన జీవితంలో వ్యాయామానికి చోటు కల్పించడం ద్వారా ఊబకాయాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అయినప్పటికీ స్థూలకాయాన్ని తగ్గించుకోలేని వారు మాత్రమే అంతిమంగా బేరియాట్రిక్‌ సర్జరీని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఊబకాయంతో పాటు, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సంబంధిత రుగ్మతలన్నీ అదుపులోకి తీసుకురావడమే తాజా బేరియాట్రిక్‌ అండ్‌ మెటబాలిక్‌ సర్జరీ లక్ష్యం. సర్జరీ తదనంతర ఫలితాలు మరింత మెరుగ్గా ఉండడం కోసం, ఆహార, వ్యాయామ నియమాలూ తప్పక అనుసరించాల్సి ఉంటుంది.

XFHN.jpg

-డాక్టర్‌ ఎన్‌. సుబ్రహ్మణ్యేశ్వర బాబు,

సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌, అపోలో హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.

Updated Date - Jul 24 , 2025 | 12:02 AM