Share News

Brahmi Plant Uses: బుద్ధి వర్ధకం బ్రాహ్మీ

ABN , Publish Date - May 31 , 2025 | 01:40 AM

బ్రాహ్మీ మొక్క మానసిక ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి, బుద్ధికి అనుకూలమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇది వృద్ధులకు, విద్యార్థులకు మరియు మానసిక ఒత్తిడి కలిగిన వారికి ఎంతో ప్రయోజనకరమైనది.

Brahmi Plant Uses: బుద్ధి వర్ధకం బ్రాహ్మీ

భోజనకుతూహలం

మనిషిని మనీషిగా అంటే, మహా మేధావిగా మలచగల అద్భుత ఔషదం బ్రాహ్మీ! దీన్నే సరస్వతీ మొక్క అని కూడా పిలుస్తారు. చెరువుల పక్కన, కాలువల అంచున, ఖాళీ స్థలాల్లో, పొలాల్లో పెరిగే మొక్క. దొరికితే వదలకండి! విద్యార్థులకీ, వృద్ధులకూ ఈ మొక్కవల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రఘునాథసూరి రాసిన ‘భోజనకుతూహలం’ గ్రంథంలో బ్రాహ్మీ గురించి ఎన్నో విశేషాలు పేర్కొన్నాడు. ఈ గ్రంథం ప్రకారం బ్రాహ్మీ.. హిమా- శరీరాన్ని చల్లబరచే స్వభావం కలది. కషాయా- వగరైన రుచి కలది. తిక్తా- చేదు రుచి కలది, వాతాస్ర జిత్‌- వాతరక్తం(గౌట్‌) వంటి వ్యాధులను తగ్గిస్తుంది, పిత్త జిత్‌- శరీరంలో పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. బుద్ధి, ప్రఙ్ఞా, మేధా కుర్యాత్‌- ఆలోచన, బుద్ధి, జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఆయుః ప్రవర్ధినీ- ఆయుష్షును పెంచుతుంది.

ప్రయోజనాలెన్నో: ఆయుర్వేదం బ్రాహ్మీని మేధో రసాయనంగా అభివర్ణించింది. దీనివల్ల మేధా (వివేకం), ధృతి (స్థిరత), స్మృతి (జ్ఞాపకశక్తి) పెరుగుతాయని పేర్కొంది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు, నిద్రలేమితో బాధపడేవారు, చదువులో ఏకాగ్రత కోల్పోయిన విద్యార్థులు, బ్రాహ్మీని తప్పనిసరిగా సేవించాలి. ఇది నరాల బలహీనతకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వృద్ధుల్లో ఆల్జీమర్స్‌ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. చెవుల్లో జుయిమనే శబ్దాన్ని (టినిటస్‌) తగ్గిస్తుంది.

ఎలా సేవించాలి?: వసకొమ్ము, శంకఫుష్టి, బ్రాహ్మీ కలిపిన పొడితో టీ తయారుచేసుకొని తాగితే అనేక ఆరోగ్య సమస్యలు దరికి రావు. ఆయిర్వేద షాపుల్లో బ్రాహ్మీరసాయనం, బ్రాహ్మీ ఘృతం, సరస్వతీ లేహ్యం మొదలైనవి లభిస్తాయి. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. - బ్రహ్మీ ఆకులను శుభ్రంగా కడిగి, తాలింపు వేసి, ఉల్లి, కొబ్బరి, చింతపండు, మిర్చి కలిపి మిక్సీలో వేస్తే బ్రాహ్మీ పచ్చడి సిద్ధం. ఇదే విధంగా ఆకులను మగ్గించి, ఉడికించిన పప్పులో కూడా కలుపుకోవచ్చు.

-గంగరాజు

అరుణాదేవి

Updated Date - May 31 , 2025 | 01:47 AM