Share News

2 నెలలుగా కనిపించని మహిళ.. ఇంటి ముందు గొయ్యి తవ్వి చూస్తే..

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:06 PM

Haryana Woman Case: ఏప్రిల్ 9వ తేదీన తను సోదరి ప్రీతి.. తనుకు ఫోన్ చేసింది. అయితే, ఫోన్ కలవలేదు. కొన్ని రోజుల తర్వాత .. ఏప్రిల్ 23వ తేదీన తను అత్తింటినుంచి ప్రీతికి ఫోన్ వచ్చింది. తను ఇంటినుంచి పారిపోయిందని వారు చెప్పారు.

2 నెలలుగా కనిపించని మహిళ.. ఇంటి ముందు గొయ్యి తవ్వి చూస్తే..
Haryana Woman Case

2 నెలల క్రితం హర్యానా, ఫరిదాబాద్‌కు చెందిన ఓ మహిళ అత్తింటినుంచి కనిపించకుండా పోయింది. కోడలు ఇంటినుంచి పారిపోయిందని అత్తింటి వారు అందరికీ చెబుతూ వచ్చారు. జనం వారు చెప్పేదే నిజం అనుకున్నారు. సీన్ కట్ చేస్తే.. కనిపించకుండా పోయిన ఆ మహిళ.. అత్తింటి ముందు శవంగా తేలింది. ఇంటి ముందు 10 అడుగుల గొయ్యి తవ్వి చూడగా అందులో ఆ మహిళ కుళ్లిన శవం బయటపడింది. అత్తింటి వారే ఆమెను హత్య చేసి అక్కడ పూడ్చి పెట్టి నట్లు తేలింది. సంఘటనకు సంబంధించి మృతురాలి కుటుంసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..


ఉత్తర ప్రదేశ్, శిఖోహాబాద్‌కు చెందిన 24 ఏళ్ల తనుకు.. హర్యానా, ఫరీదాబాద్‌కు చెందిన అరుణ్‌తో 2023లో పెళ్లింది. పెళ్లి తర్వాత తను రోషన్ నగర్‌లోని అత్తింటికి వచ్చింది. అయితే, అత్తింట్లో తను ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అత్తింటి వారు వేధిస్తున్నారంటూ పుట్టింటికి వచ్చేసింది. దాదాపు సంవత్సరం పాటు పుట్టింట్లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఆమెను ఒప్పించి.. అత్తింటికి పంపారు. అత్తింటికి వెళ్లిన తర్వాత తను మళ్లీ ఫోన్ చేయలేదు.


ఏప్రిల్ 9వ తేదీన తను సోదరి ప్రీతి.. తనుకు ఫోన్ చేసింది. అయితే, ఫోన్ కలవలేదు. కొన్ని రోజుల తర్వాత .. ఏప్రిల్ 23వ తేదీన తను అత్తింటినుంచి ప్రీతికి ఫోన్ వచ్చింది. తను ఇంటినుంచి పారిపోయిందని వారు చెప్పారు. వారి మాటల్ని తను తల్లిదండ్రులు, ప్రీతి నమ్మలేదు. అత్తింటి వారు తనును ఏమైనా చేసి ఉంటారని భావించారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారిపై ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు అయినా.. కొన్ని రోజుల పాటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


రెండు వారాల తర్వాత కేసు మీద దృష్టి సారించారు. దర్యాప్తు మొదలుపెట్టారు. అరుణ్ పొరిగింటి వాళ్లను, గ్రామస్తులను విచారించారు. తను కనిపించకుండా పోవడానికి ముందు .. తను మామ ఇంటి ముందు ఓ పెద్ద గొయ్యి తవ్వాడని చెప్పారు. అడిగితే ‘ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. అందుకే గుంత తవ్వుతున్నాం’ అని చెప్పాడు. గుంత తవ్విన వెంటనే దాన్ని సిమెంట్‌తో మూసేశారని పొరిగింటి వారు అన్నారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఇంటి ముందు గుంత తవ్వించారు.


అందరూ షాక్ అయ్యేలా ఆ గుంతలో తను కుళ్లిన శవం బయటపడింది. పోలీసులు ఆ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తను భర్త, అత్తామామను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా కుందూ మాట్లాడుతూ.. ‘వారం క్రితం ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. గొయ్యి నుంచి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. తను ఎప్పుడు, ఎలా చనిపోయిందో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ పరీక్షలు జరుగుతున్నాయి’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ.. చెక్ చేసుకోండి..

ఇరాన్‌లో భారీ భూకంపం.. న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసిందా..

Updated Date - Jun 21 , 2025 | 06:06 PM