Indian Cardinals: వాటికన్ చర్చి తదుపరి అధిపతికి ఓటు వేయగల భారతీయులెవరో తెలుసా?
ABN , Publish Date - Apr 21 , 2025 | 09:13 PM
పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత వాటికన్ చర్చికి తదుపరి అధిపతి ఎవరు? ఎలా ఎన్నుకుంటారు అనేది ప్రశ్న. అయితే, ఇది ఓటింగ్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఈ ఓటింగ్ లో పాల్గొనే అవకాశం భారత దేశం నుంచి ఆరుగురికి మాత్రమే.

Head of Catholic: పోప్ ఫ్రాన్సిస్ ఈ ఉదయం(సోమవారం) కన్నుమూశారు. ఇక, వాటికన్ కాథలిక్ చర్చికి తదుపరి అధిపతి ఎవరు? ఎలా ఎన్నుకుంటారు అనేది అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న. కొత్త అధిపతిని ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. 80 ఏళ్లలోపు 138 మంది కార్డినల్స్ సమావేశం జరుగుతుంది. వారు కాథలిక్ చర్చి యొక్క తదుపరి అధిపతికి ఓటు వేయడానికి అర్హులు. ఓటు వేయడానికి మన భారత దేశం నుంచి ఆరుగురు కార్డినల్స్‌కు అవకాశం ఉంది. అయితే, ఇద్దరు కార్డినల్స్ కు వయసు 80 ఏళ్లకు పైనబడింది. దీంతో వారిద్దరూ ఓటు వేయడానికి అనర్హులు. దీంతో భారతదేశం నుంచి వాటికన్ చర్చి అధిపతికి ఓటు వేయగల అర్హత ఉన్న కార్డియన్ల సంఖ్య నాలుగుకు చేరింది. అర్హత ఉన్న ఎవరీ నలుగురు భారతీయులు అనే వివరాల్లోకి వెళ్లే ముందు..
తదుపరి పోప్ ఎన్నిక :
అనేక రౌండ్ల చర్చలు, ఇంకా ఓటింగ్ ద్వారా కొత్త పోప్ ఎన్నిక జరుగుతుంది. ప్రతి కార్డినల్ తమకు నచ్చిన అభ్యర్థి పేరును బ్యాలెట్‌పై వ్రాస్తారు. బ్యాలెట్‌లను మడిచి, మైఖేలాంజెలో చివరి తీర్పు ఫ్రెస్కోతో కూడిన చాలీస్‌లో ఉంచుతారు. తరువాత, ఓట్లను రికార్డ్ చేయడానికి మరియు లెక్కించడానికి ముగ్గురు కార్డినల్స్‌ను ఎంపిక చేస్తారు. ఒక అభ్యర్థి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించే వరకు ప్రతిరోజూ నాలుగు రౌండ్ల ఓటింగ్ జరుగుతుంది. అంతేకాకుండా, ఏ అభ్యర్థి కూడా అవసరమైన సంఖ్యలో ఓట్లు సాధించకపోతే, బ్యాలెట్లను ప్రార్థనా మందిరంలోని ప్రత్యేక స్టవ్‌పై రసాయనాలతో కాల్చివేస్తారు. ఓటింగ్ కొనసాగుతుందని సూచిస్తూ చిమ్నీ నుండి నల్లటి పొగ పైకి లేస్తుంది. అయితే, పోప్ ఎన్నిక పూర్తయిన తర్వాత తెల్లటి పొగ విడుదల అవుతుంది. ఇక, కొత్త పోప్‌ను ప్రకటించడానికి "మనకు పోప్ ఉన్నాడు" అని తెలిపే ప్రసిద్ధ లాటిన్ పదబంధం "హబేమస్ పాపం" స్పురిస్తూ ఎన్నిక పూర్తి చేస్తారు.
ఓటు వేయబోయే భారతీయ కార్డినల్స్
ప్రస్తుతం, భారతదేశంలో ఆరుగురు కార్డినల్స్ ఉన్నారు, కానీ కార్డినల్స్ జార్జ్ అలంచెర్రీ(80), ఓస్వాల్డ్ గ్రేసియాస్(80), వీరిరువురూ 80ఏళ్లు పైబడ్డవారు కావడంతో తమ బ్యాలెట్‌లను వేయడానికి అనర్హులు. ఇక తదుపరి పాపల్ కాన్‌క్లేవ్ లో ఓటు వేయడానికి అర్హులైన నలుగురు కార్డినల్స్ అందరూ వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చినవారు.. కాథలిక్ చర్చిలలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నవారు. వీరిలో ఒకరు..
1. కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావ్
72 సంవత్సరాల వయస్సు గల ఈయన గోవా అండ్ డామన్ యొక్క ఆర్చ్ బిషప్. ముఖ్యంగా వలసలు, వాతావరణ మార్పు, కుటుంబ పరిచర్య, మతాంతర సంభాషణలకు సంబంధించి ఆయన సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఫిలిప్ నేరి ఫెర్రావ్ అక్టోబర్ 28, 1979న అర్చకత్వాన్ని పొందారు. ఏప్రిల్ 10, 1994న ఎపిస్కోపల్ ఆర్డినేషన్ పొందారు. ఆయన ఆగస్టు 27, 2022న కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ కు పదోన్నతి పొందారు.
2. కార్డినల్ క్లీమిస్ బసెలియోస్
కార్డినల్ క్లీమిస్ బసెలియోస్(64), ఈయన ఐజాక్ తొట్టుంకల్ ఫ్యామిలీలో జన్మించారు. కేరళలోని త్రివేండ్రం మేజర్ ఆర్చ్ బిషప్. సిరో-మలంకర కాథలిక్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిషప్ కూడా. బసెలియస్ నవంబర్ 24, 2012న కాలేజ్ ఆఫ్ కార్డినల్స్‌గా పదోన్నతి పొందారు. జూన్ 11, 1986న అర్చకత్వాన్ని, ఆగస్టు 15, 2001న ఎపిస్కోపేట్‌ను పొందారు.
3. కార్డినల్ ఆంథోనీ పూల
కార్డినల్ ఆంథోనీ పూల(63), భారతదేశపు మొట్టమొదటి దళిత కార్డినల్. ఆయన పేద పిల్లలకు సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నారు. కార్డినల్స్ కళాశాలకు ఆయన పదోన్నతిని కుల ఆధారిత అన్యాయాలను పరిష్కరించే దిశగా ఒక అడుగుగా భావిస్తారు.
4. కార్డినల్ జార్జ్ జాకబ్ కూవకాడ్
ఇతని వయస్సు 51 ఏళ్లు. కేరళకు చెందిన వాటికన్ దౌత్యవేత్త. సిరో మలబార్ చర్చి ఆర్చ్ బిషప్. ఆయన పోప్ ఫ్రాంక్‌ను నిర్వహించారు. ఈ నలుగురు ప్రఖ్యాత వాటికన్ చర్చ్ తదుపరి అధిపతి ఎవరనేది నిర్ణయించే అధికారంలో భాగస్వాములుగా ఉండటం విశేషం.
ఇవి కూడా చదవండి
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Gold price : రూ. లక్షకు చేరువైన బంగారం