Stray Dogs Save Baby: అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుమీద పడేస్తే..రక్షణ కవచంగా నిలిచిన వీధి కుక్కలు
ABN , Publish Date - Dec 03 , 2025 | 01:08 PM
వీధికుక్కలు వ్యవహించిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పడే పుట్టిన పసికందును కన్నవాళ్లు రోడ్డు మీద వదిలేస్తే, ఆ చిన్నారి చుట్టూ చేరి తెల్లవార్లూ రక్షణ కవచంగా నిలిచి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాయి అక్కడి వీధి శునకాలు..
నాబద్వీప్ (పశ్చిమ బెంగాల్), డిసెంబర్ 3: అప్పుడే పుట్టిన శిశువును కన్నవారు రోడ్డుపై వదిలేస్తే.. ఆ చిన్నారిని వీధి కుక్కలు కంటికి రెప్పలా కాపాడాయి. ఆ పసికందు చుట్టూ చేరి.. తెల్లవార్లూ కాపలాగా ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా నాబద్వీప్‌లో ఈ సంఘటన జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా నాబద్వీప్ రైల్వే కార్మికుల కాలనీలో బాత్‌రూమ్ వద్ద రాత్రి సమయంలో పసిబిడ్డను దుప్పటిలో చుట్టి వదిలేశారు. దుప్పటిలో చుట్టి ఉన్న ఆ పసికందు చూట్టూ వీధి కుక్కలు చేరి.. ఉదయం వరకు రక్షణగా ఉన్నాయి.
తెల్లవారిన తర్వాత కుక్కల మధ్యలో చిన్నారి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే ఆ పసికందును ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పసికందు పట్ల కుక్కలు వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ముందుగా చిన్నారిని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించినప్పుడు కుక్కలు ఎవరినీ దగ్గరకు రానివ్వలేదని.. దీంతో పొరుగువారి సాయంతో శిశువును మహేష్ గంజ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. చిన్నారిని ఎవరు వదిలివెళ్లారనే విషయం తెలుసుకోవడానికి స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మొదట మహేష్‌గంజ్ ఆసుపత్రికి తరలించిన బిడ్డను తర్వాత కృష్ణనగర్ సదర్ ఆసుపత్రికి మార్చినట్టు పోలీసులు వెల్లడించారు. బిడ్డకు ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు. చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తున్న వార్తలు వస్తున్న ఈ తరుణంలో అప్పుడే పుట్టిన చిన్నారికి వీధి కుక్కలే రక్షణగా మారిన ఘటన అటు, సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...
Read Latest Telangana News and National News