Bihar Deputy CM attack: బీహార్ డిప్యూటీ సీఎంపై దాడి.. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు..
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:54 PM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ హింసాత్మకంగా మారింది. గురువారం ఉదయం 7 గంటలకు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సమయంలో బీహార్ డిప్యూటీ సీఎం, లఖిసరాయ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా కారుపై దాడి జరిగింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ హింసాత్మకంగా మారింది. గురువారం ఉదయం 7 గంటలకు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సమయంలో బీహార్ డిప్యూటీ సీఎం, లఖిసరాయ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా కారుపై దాడి జరిగింది. లఖిసరాయ్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన కాన్వాయ్‌పై ఆర్జేడీ కార్యకర్తలు దాడి చేశారని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ ఆటవిక పాలన తప్పదని విజయ్ కుమార్ సిన్హా హెచ్చరించారు (Bihar violence).
లఖిసరాయ్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను విజయ్ కుమార్ సందర్శిస్తున్న సమయంలో ఆయన కారును కొందరు వ్యక్తులు అడ్డుకునే యత్నం చేశారు ( Lakhisarai convoy attack). విజయ్ కుమార్ వాహనంపై చెప్పులు, పేడ విసరడంతో పాటు, ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. విజయ్ కుమార్ సిన్హా వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. తన నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్జేడీ కార్యకర్తలు ప్రయత్నించారని, దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకోలేదని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు (election violence Bihar).
పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి జనసమూహాన్ని వెనక్కి నెట్టి, విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌ను సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు (Vijay Sinha convoy). ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీహార్ రాష్ట్ర డీజీపీని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆదేశించినట్టు ఈసీ తెలిపింది. బీహార్ రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ రోజు తొలి దశ పోలింగ్‌లో భాగంగా 121 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Trump-Mamdani: మందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్.. న్యూయార్కర్లు పారిపోక తప్పదంటూ కామెంట్
control Pollution in Delhi: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు సాయం చైనా